కొవిడ్ వ్యాక్సిన్ సేకరణ, నిర్వహణలో ఎదురయ్యే లాజిస్టిక్స్, నైతికపరమైన అంశాలను పరిశీలించడానికి నీతి ఆయోగ్ సభ్యుడు డా. వీకే పాల్ అధ్యక్షతన నిపుణుల కమిటీ ఇవాళ భేటీ కానుంది. రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులు, వ్యాక్సిన్ తయారీదారులతో ఈ కమిటీ చర్చలు జరపనున్నట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.
వ్యాక్సిన్ అభివృద్ధి చేసిన తర్వాత కావాల్సిన కోల్డ్ చైన్ లాజిస్టిక్స్, పంపిణీ వ్యూహాలు, శిక్షణ వంటి అంశాలపై సమగ్ర వ్యూహాలను కమిటీ రూపొందిస్తుంది.
"కొవిడ్ వ్యాక్సిన్‌పై నీతిఆయోగ్ సభ్యుడు వీకే పాల్ నేతృత్వంలో ఏర్పాటైన నిపుణుల కమిటీ సమావేశం ఆగస్టు 12న జరగనుంది. కొవిడ్ వ్యాక్సిన్ సేకరణ, రవాణా సహా ఇతర అంశాలను కమిటీ పరిగణనలోకి తీసుకుంటుంది."
-కేంద్ర వైద్యారోగ్య శాఖ ట్వీట్
దేశంలో టీకా అభివృద్ధి ప్రయత్నాలు శరవేగంగా జరుగుతున్నాయి. భారత్ బయోటెక్, ఐసీఎంఆర్ సంయుక్తంగా రూపొందించిన కొవాగ్జిన్‌తో పాటు, జైడస్ కాడిలా టీకా సైతం ఫేజ్-2 ట్రయల్స్‌లోకి అడుగుపెట్టాయి. ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం అభివృద్ధి చేసిన టీకాకు దేశంలో ఫేజ్-2, 3 క్లినికల్ ట్రయల్స్ చేపట్టే విధంగా సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు అనుమతి లభించింది.
ఇదీ చూడండి: 'ప్రపంచవ్యాప్తంగా రోజువారీ కేసుల్లో భారత్ టాప్'