బంగాల్లో మరోసారి పూర్తి స్థాయిలో లాక్డౌన్ అమలవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడ చూసిన రహదారులు, వీధులు నిర్మానుష్యంగా దర్శనమిస్తున్నాయి. షాపులు, దుకాణాలను మూసివేశారు యజమానులు.
కరోనా కట్టడిలో భాగంగా మమతా బెనర్జీ సర్కారు వారంలో రెండు రోజుల పాటు లాక్డౌన్ విధించాలని నిర్ణయించింది. ఈ వారంలో జులై 25, 29న ఇదే తరహా లాక్డౌన్ అమలు కానుంది.
పోలీసుల పర్యవేక్షణ...
లాక్డౌన్ నేపథ్యంలో ప్రత్యేకంగా పోలీసులు పలు ప్రాంతాల్లో పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. బారీకేడ్లను ఏర్పాటు చేసి ఇళ్లలో నుంచి ప్రజలు ఎవరు బయటకు రాకుండా చూస్తున్నారు. వచ్చిన వారిని.. తిరిగి నివాసాలకు పంపిస్తున్నారు.
930 కంటైన్మెంట్ జోన్లు...
ప్రభుత్వ, ప్రైవేటు వాణిజ్య కార్యకలాపాలు, నిత్యావసర సరకుల రవాణా మినహా ఇతర కార్యకలాపాలు నిలిపివేయాలని ఇప్పటికే అధికారులు ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 930 కంటైన్మెంట్ జోన్లు ఉన్నట్లు తెలిపారు. వీటిలో నిత్యావసర వస్తువులకు ప్రజలు బయటకు రావటానికి నిర్ణీత సమయాన్ని కేటాయించారు.
రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 49,321 మందికి వైరస్ సోకగా, 1,221 మంది మృతి చెందారు.