కంటైన్మెంట్ విధానం, విస్తృతమైన పరీక్షలు, చికిత్స ప్రమాణాల మెరుగదల కారణంగా దేశంలో కరోనా రికవరీ రేటు గణనీయంగా పెరిగింది. ఇప్పటివరకు 69.8 శాతం రికవరీ రేటు నమోదైంది. మరణాల రేటు కూడా 2 శాతం దిగువకు పడిపోయిందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
గడిచిన 24 గంటల్లో కరోనా నుంచి 47,746 మంది కోలుకోగా.. మొత్తం సంఖ్య 15.83 లక్షలకు చేరిందని మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రస్తుతం 6.39 లక్షల (28.21 శాతం) క్రియాశీల కేసుల ఉన్నాయని స్పష్టం చేసింది. వీరంతా వైద్య పర్యవేక్షణలో ఉన్నట్లు వెల్లడించింది.
సత్వర సేవలతో..
ఆసుపత్రుల్లో ప్రభావవంతమైన చికిత్స విధానంపై దృష్టి సారించినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. సత్వర సేవలు, ఆంబులెన్సుల నిర్వహణతో వ్యాధిగ్రస్తులకు సమర్థమైన చికిత్స లభిస్తోందని స్పష్టం చేసింది. ఫలితంగా ప్రపంచ సగటుతో పోలిస్తే మరణాల రేటు అదుపులో ఉందని పేర్కొంది.
22 లక్షల కేసులు..
దేశంలో కొత్తగా 53 వేల కేసులు నమోదు కాగా మొత్తం సంఖ్య 22.68 లక్షలకు చేరింది. గడిచిన 24 గంటల్లో 871 మంది చనిపోగా ఇప్పటివరకు మొత్తం మృతుల సంఖ్య 45,257గా ఉంది.
ఇదీ చూడండి: తండ్రి ఆఖరి చూపు ఖరీదు రూ. 51,000/-..!