అసోం దరంగ్ జిల్లాలో ఓ వ్యక్తి పేరు ఇప్పుడు ఆ ప్రాంతంలో భయం పుట్టిస్తోంది. రెండు రోజుల క్రితం మంగల్దోయ్ ప్రభుత్వాసుపత్రిలో కరోనా బారి నుంచి కోలుకున్న 14 మంది పేర్లను చదివారు వైద్యులు. ఆ జాబితాలో చదివిన పేరు తన పేరులాగే వినిపించి కొవిడ్ నుంచి కోలుకున్నాడని నిర్ధరించకముందే ఓ వ్యక్తి స్పందించాడు. కరోనా నయం అయ్యిందనుకుని ఇంటికి వెళ్లిపోయాడు.
అయితే ఆ పేరు తనది కాదని, దల్గావ్కు చెందిన మరో వ్యక్తి పేరని వైద్యులకు తర్వాత తెలిసింది. దీంతో హుటాహుటిన అంబులెన్స్ పంపి... ఆ వ్యక్తిని తిరిగి ఆసుపత్రికి తీసుకొచ్చారు. మళ్లీ పరీక్షలు నిర్వహించారు. అదృష్టవశాత్తూ ఆ వ్యక్తికీ కరోనా నయమైపోయిందని తేలింది.
ఒకే రకమైన పేర్లు ఉండి, మాస్కుల కారణంగా ముఖాలు కనిపించకే ఈ పొరపాటు జరిగిందన్నారు వైద్యులు. దరంగ్ డిప్యూటీ కమిషనర్ దిలీప్ కుమార్ వోరా ఈ ఘటనపై విచారణ చేపట్టారు. పొరపాటుగా డిశ్చార్జ్ అయిన వ్యక్తి ఇంటిని కంటెయిన్మెంట్ జోన్‌గా ప్రకటించారు.
అసోంలో ఇప్పటికే 3,600 కరోనా కేసులు నమోదయ్యాయి. వారిలో 8 మంది మృతి చెందగా, మరో 2000 మంది చికిత్స పొందుతున్నారు.
ఇదీ చదవండి:కరోనా చికిత్సపై హైకోర్టు కీలక ఆదేశాలు