ప్రపంచంలోని అన్ని రంగాలను కుదేలు చేసిన కరోనా మహమ్మారి విద్యారంగంపై పెను ప్రభావాన్ని చూపుతోందని వెల్లడించింది ఐక్యరాజ్య సమితి . కరోనా విస్తృత వ్యాప్తి నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా విద్యారంగంపై ఐక్యరాజ్య సమితి విధానాన్ని సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ప్రకటించారు. కొవిడ్ వల్ల విద్యారంగం గతంలో ఎప్పుడూ లేని అతిపెద్ద అంతరాయాన్ని ఎదుర్కొంటోందని ఆయన తన వీడియో సందేశంలో పేర్కొన్నారు.
జులై మధ్య నాటికి 160కిపైగా దేశాలలో పాఠశాలలను మూసేశారని, దీనివల్ల వంద కోట్ల మంది విద్యార్థులు ప్రభావితమయ్యారని తెలిపారు ఆంటోనియో . ప్రపంచవ్యాప్తంగా దాదాపు 40 లక్షల మంది ప్రీ స్కూల్ ఇయర్‌ను కోల్పోయారని వెల్లడించారు.
దశాబ్దాల పురోగతి ఏమవుతోంది...?
సుదీర్ఘ కాలంగా పాఠశాల మూసివేయడం వల్ల.. విద్యా అసమానతలు, అభ్యాస నష్టాలను తీవ్రమయ్యాయని ఐరాస విద్యా విధానంలో పేర్కొన్నారు. కరోనా మహమ్మారి వ్యాప్తి... దశాబ్దాల్లో సాధించిన పురోగతిని చెరిపేసే ప్రమాదం ఉందని గుటెరస్ హెచ్చరించారు. కొవిడ్ వల్ల ఏర్పడిన ఆర్థిక సంక్షోభం కారణంగా.. 23 లక్షల 80 వేల మంది వచ్చే ఏడాది విద్యకు దూరమయ్యే అవకాశం ఉందని గుటెరస్ తెలిపారు. నాణ్యమైన విద్యావ్యవస్థను రూపొందించడానికి.... ధైర్యంతో కఠిన నిర్ణయాలు తీసుకోవాలని ప్రపంచ దేశాలకు సూచించిన గుటెరస్.... ఆన్‌లైన్ పాఠాలు అందిస్తున్నా.... చాలా మంది విద్యార్థులకు అది అందుబాటులో లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఆన్‌లైన్ విద్య వల్ల వికలాంగులు, బలహీన వర్గాలు, మారుమూల ప్రాంతాల్లో ఉన్న వారు విద్యలో వెనకపడిపోయే అవకాశం ఉందన్నారు.
కరోనా వ్యాప్తి వల్ల మానవ సామర్థ్యాన్ని వృథా చేయగల, దశాబ్దాల పురోగతిని అణగదొక్కగల, అసమానతలను పెంచగల... ఒక మహా విపత్తును మానవ జాతి ఎదుర్కోంటోందని గుటెరస్ అభిప్రాయపడ్డారు. పిల్లల పోషణ, బాల్య వివాహాలు, లింగ సమానత్వంపై కరోనా ప్రభావం తీవ్రంగా ఉందన్న ఆయన.. ప్రపంచ దేశాలు సేవ్ అవర్ ఫ్యూచర్ అనే నూతన ప్రచారంపై దృష్టి సారించాలని సూచించారు. ఈ ప్రచారం పిల్లలు, యువకులకు చేయూతను ఇస్తుందన్న గుటెరస్.. ప్రభుత్వాల నిర్ణయాలు కోట్ల మంది యువత, దేశాభివృద్ధిపై శాశ్వత ప్రభావాన్ని చూపుతాయని గుటెరస్ తెలిపారు. కరోనా సంక్షోభానికి ముందే తక్కువ, మధ్య ఆదాయం ఉన్న దేశాలు ఏడాదికి 1.5 ట్రిలియన్ డాలర్ల విద్యా నిధుల అంతరాన్ని ఎదుర్కొంటున్నాయన్న ఐరాస విద్యా విధానం... ఇప్పుడు ఈ అంతరం భారీగా పెరిగిందని వెల్లడించింది.
ఇదీ చదవండి: అమెరికాలో 'రామాలయం భూమిపూజ' వేడుకలు