కర్ణాటకలో కరోనా తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. బెంగళూరు సహా అనేక ప్రాంతాల్లో వైరస్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో 'మనల్ని దేవుడే కాపాడాలి' అంటూ కర్ణాటక ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి బి.శ్రీరాములు చేసిన వ్యాఖ్యలు సర్వత్రా చర్చనీయాంశమయ్యాయి.
'అందరూ సమానమే...'
రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన శ్రీరాములు.. వైరస్‌కు ఎవరూ అతీతులు కారని.. అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ క్రమంలోనే ప్రజలను దేవుడే కాపాడాలన్నారు.
"ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. అందరూ అప్రమత్తంగా ఉండాలి. అధికారపక్షమైనా, విపక్షమైనా.. పేద అయినా, ధనికులైనా.. ఈ వైరస్ ఎవరినీ వదలదు. రానున్న రెండు నెలల్లో కేసులు కచ్చితంగా 100శాతం పెరుగుతాయి. దీనిని ప్రభుత్వ వైఫల్యమని, మంత్రుల నిర్లక్ష్యం అని మీరు అనుకోవచ్చు. కానీ అందులో నిజం లేదు. కరోనా నుంచి మనల్ని దేవుడే కాపాడాలి."
-శ్రీరాములు, కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి.
మంత్రి వ్యాఖ్యలపై ప్రతిపక్ష కాంగ్రెస్ మండిపడింది. కరోనా సంక్షోభంపై భాజపా ప్రభుత్వ తీరుకు ఇవి అద్ధం పడుతున్నాయని విమర్శించింది. ప్రజల జీవితాలను దేవుడి దయకు వదిలేయడం దురదృష్టకరమని పేర్కొంది.
తన వ్యాఖ్యలపై దుమారం చెలరేగడం వల్ల మంత్రి శ్రీరాములు స్పష్టతనిచ్చారు.
"నా వ్యాఖ్యలను మీడియా వక్రీకరించింది. ప్రజల సహకారంతో దేవుడు మనల్ని రక్షించాలన్నాను. వ్యాక్సిన్ వచ్చేంత వరకు ప్రజలను కాపాడటానికి దేవుడు ఉన్నాడు అని అన్నాను."
-శ్రీరాములు, కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి.
కర్ణాటకలో వైరస్ కేసుల సంఖ్య 47వేలు దాటింది. ఇప్పటివరకు 928మంది ప్రాణాలు కోల్పోయారు.
ఇదీ చూడండి:- కరోనా టాప్‌గేర్‌తో ఆ రాష్ట్రాల్లో మళ్లీ లాక్డౌన్