సీబీఎస్‌ఈ బోర్డు పరీక్షలకు వచ్చే ఏడాది హాజరవబోతున్న విద్యార్థులు ఇకపై లౌకికవాదం, పౌరసత్వం, జాతీయవాదం, నోట్లరద్దు, ప్రజాస్వామ్య హక్కులు సహా ఇతర పాఠ్యాంశాలను చదవాల్సిన అవసరం లేదు. వీటిని సిలబస్ నుంచి తొలగిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది సీబీఎస్‌ఈ బోర్డు.
కరోనా నేపథ్యంలో విద్యార్థులపై భారం తగ్గించేందుకు 9 నుంచి 12వ తరగతుల పాఠ్యాంశాలను సీబీఎస్‌ఈ 30శాతం కుదించింది. ప్రత్యేక కమిటీ సిఫార్సుల మేరకు తొలగించిన సిలబస్ వివరాలతో బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది.
పదో తరగతిలో..
పదో తరగతి పాఠ్యాంశాల్లో నుంచి ప్రజాస్వామ్య వైవిధ్యం, లింగం, మతం, కులం, ప్రజాదరణ పొందిన పోరాటాలు, ఉద్యమాలు, ప్రజాస్వామ్యానికి సవాళ్లు అనే అంశాలను తొలగించారు.
11వ తరగతిలో..
11వ తరగతి సిలబస్ నుంచి ఫెడరలిజం, పౌరసత్వం, జాతీయవాదం, లౌకికవాదం, భారతదేశంలో స్థానిక ప్రభుత్వాల పెరుగుదల అంశాలను తొలగించారు.
12వ తరగతిలో..
12వ తరగతి పాఠ్యాంశాల్లో నుంచి భారత సరిహద్దు దేశాలతో సంబంధాలు, ఆర్థిక అభివృద్ధి పెరుగుదల, సామాజిక ఉద్యమాలు అనే అంశాలను చదవాల్సిన అవసరం లేదని సీబీఎస్‌ఈ స్పష్టం చేసింది.
తొలగించిన పాఠ్యాంశాల్లో నుంచి పరీక్షల్లో ఎలాంటి ప్రశ్నలు రావని.. వాటిని విద్యార్థులకు బోధించాల్సిన అవసరం లేదని అన్ని పాఠాశాలలకు ఇప్పటికే సూచించినట్లు సీబీఎస్‌ఈ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు.
షాక్‌కు గురయ్యా: మమత
సీబీఎస్‌ఈ సిలబస్ నుంచి పౌరసత్వం, సమాఖ్యవాదం, లౌకికవాదం వంటి అంశాలను కేంద్ర ప్రభుత్వం తొలగించినట్లు తెలిసి షాక్‌కు గురయ్యానని పేర్కొన్నారు బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. ఈ చర్యను తాను వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. ఎట్టిపరిస్థితుల్లోనూ ఇలాంటి పాఠ్యాంశాలను తొలగించొద్దని మానవ వనరుల అభివృద్ధి శాఖ, కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
మిశ్రమ స్పందన..
కరోనా లాక్డౌన్ నేపథ్యంలో సీబీఎస్‌ఈ సిలబస్ హేతుబద్ధీకరణపై పాఠాశాల యాజమాన్యాలు, విద్యా రంగ నిపుణుల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. ఈ చర్యను పలు పాఠశాలల ప్రతినిధులు స్వాగతించారు. పలువురు విద్యావేత్తలు వ్యతిరేకించారు. ఈ నిర్ణయం సైద్ధాతింకంగా తీసుకున్నట్లుగా ఉందని విమర్శించారు. ఈ చర్య వల్ల నీట్, జేఈఈ ప్రవేశ పరీక్షల సిలబస్‌పై ప్రభావం పడుతుందని పేర్కొన్నారు. పాఠ్యాంశాలకన్నా రాజకీయ అంశాలకు ఎక్కువ ప్రాముఖ్యం ఇచ్చినట్లు ఉందని విమర్శించారు.
ఇవీ చూడండి: 30 శాతం సిలబస్ తగ్గించిన సీబీఎస్‌ఈ