దేశంలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. మొత్తం 16 వేల 116 మంది కరోనా బారినపడ్డారు. శనివారం సాయంత్రం నుంచి కొత్తగా 1324 మందికి వైరస్ సోకింది. మరో 31 మరణాలతో మొత్తం మృతుల సంఖ్య 519కి చేరింది. బాధితుల్లో ఇప్పటివరకు 2301 మంది కోలుకోగా.. యాక్టివ్ కేసుల సంఖ్య 13, 295గా ఉంది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ వివరాలు వెల్లడించింది.
అయితే.. భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) గణాంకాల ప్రకారం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 17 వేల 615గా ఉంది. మొత్తం 4,01,586 నమూనాలను పరీక్షించినట్లు స్పష్టం చేసింది. పరీక్షించిన వారిలో సగటున 4.58 శాతం మందికి వైరస్ సోకినట్లు తేలింది.
మహారాష్ట్ర, గుజరాత్‌లలో తీవ్రం..
ఆదివారం నమోదైన 31 మరణాల్లో గుజరాత్, మహారాష్ట్ర నుంచి అత్యధికంగా 10 మంది చొప్పున ఉన్నారు. పంజాబ్, ఉత్తర్‌ప్రదేశ్‌లో ముగ్గురు చొప్పున, బంగాల్లో ఇద్దరు, దిల్లీ, మధ్యప్రదేశ్, కర్ణాటకల్లో ఒకరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు.
మొత్తం మృతుల్లో 211 మందితో మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉంది. మధ్యప్రదేశ్ (70), గుజరాత్ (58), దిల్లీ(43) మరణాలతో వరుసగా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
7 రాష్ట్రాల్లో 1000 ప్లస్...
కేసుల పరంగా చూస్తే 7 రాష్ట్రాల్లో 1000కిపైగా నమోదయ్యాయి. మహారాష్ట్రలో 3651, దిల్లీలో 1893, గుజరాత్లో 1604, మధ్యప్రదేశ్‌లో 1407, తమిళనాడులో 1372 మంది బాధితులున్నారు. రాజస్థాన్‌లో 1351, ఉత్తర్‌ప్రదేశ్‌లో 1084 మందికి వైరస్ సోకింది.
హిమాచల్‌లో అలా...
కరోనా సోకి కోలుకున్న వ్యక్తికి మళ్లీ వైరస్ తిరగబెట్టింది. కరోనా లక్షణాలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని సిమ్లా ఆసుపత్రిలో చేరిన ఓ వ్యక్తికి వైరస్ నిర్ధరణ అయింది. చికిత్స అనంతరం.. నిర్వహించిన రెండు పరీక్షల్లో నెగిటివ్‌గా రాగా.. మళ్లీ ఫలితం శనివారం పాజిటివ్‌గా వచ్చింది.
మహారాష్ట్రలో ఒక్కరోజే 552 మందికి..
రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రకటించిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రలో ఆదివారం అత్యధిక సంఖ్యలో కరోనా కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజే 552 మందికి వైరస్ సోకగా.. మొత్తం బాధితుల సంఖ్య 4200 దాటినట్లు పేర్కొంది. మరో 12 మంది మరణించినట్లు వెల్లడించింది.
డాక్టర్ మృతి..
తమిళనాడు చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రి డైరెక్టర్, చీఫ్ డాక్టర్.. కరోనా కారణంగా మరణించినట్లు తెలుస్తోంది. న్యూరోసర్జన్ అయిన ఆ 55 ఏళ్ల వ్యక్తి.. కొన్నిరోజులుగా వెంటిలేటర్‌పైనే చికిత్స పొందుతున్న క్రమంలో పరిస్థితి విషమించి చనిపోయినట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.
కమ్యూనిటీ పరీక్షలు..
వైద్య బృందాల ద్వారా కమ్యూనిటీ ఆధారిత పరీక్షలు చేపడుతున్నామని, క్షేత్రస్థాయికి వెళ్లే వైద్య సిబ్బందికి భద్రత కల్పించే విషయంలో రాష్ట్రాలు ఈ మేరకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆదేశించారు.