భారత్ సహా ప్రపంచ దేశాలను బెంబేలెత్తిస్తోన్న కొవిడ్-19 ప్రభావం వల్ల తీవ్రంగా నష్టపోతున్న కార్మికులకు ఆర్థిక ప్యాకేజీ ప్రకటించాలని కేంద్ర కార్మిక సంఘాలు ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశాయి. ప్రభుత్వం వెంటనే 5 నుంచి 7 లక్షల కోట్ల రూపాయిల ప్యాకేజీని ప్రకటించాలని డిమాండ్ చేశాయి.
కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్డౌన్ వల్ల అన్ని వర్గాల ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ, సీఐటీయూ సహా మొత్తం 10 యూనియన్లు లేఖలో ప్రస్తావించాయి.
'' ప్రస్తుత లాక్డౌన్ పరిస్థితుల్లో కార్మికులు ఎన్నో కష్టాలను ఎదుర్కొంటున్నారు. తక్షణమే ఈ వర్గం కోసం 5 నుంచి 7 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీ ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాం.''
- మోదీకి లేఖలో కార్మిక సంఘాలు
కార్మికులుగా నమోదు చేసుకున్న ప్రతి ఒక్కరికీ 5000 చొప్పున ఆర్థిక సహాయం ఇవ్వాలని కోరాయి. బంద్‌తో సతమతవుతున్న చిన్న,మధ్య తరహా పరిశ్రమలకు, చిరు వ్యాపారులుకు రాయితీలు ప్రకటించాలని డిమాండ్ చేశాయి. రోజు కూలీ మీద జీవించే కార్మికుల పరిస్థితి ప్రస్తుతం మరింత దయనీయంగా మారిందని లేఖలో ప్రస్తావించారు. పౌరసరఫరాల శాఖ ద్వారా నిత్యావసర సరుకులు వెంటనే అందచేయాలని కోరారు.