కరోనాతో భయపడాల్సిన పనిలేదని సందేశమిస్తున్నాడు దిల్లీ తొలి కరోనా బాధితుడు. ఈశాన్య దిల్లీ, మయూర్ విహార్‌కు చెందిన 45 ఏళ్ల వ్యాపారవేత్తకు గత నెలలో కరోనా సోకినట్లు నిర్ధరణయ్యింది. దిల్లీలో నమోదైన తొలి కరోనా కేసు ఇదే. అయితే, ప్రస్తుతం ఆయన వైరస్ నుంచి కోలుకుంటున్నాడు.
14 రోజులుగా నిర్బంధంలో ఉన్న బాధితుడిని తన నివాసం నుంచి.. ఫోన్లో సంప్రదించింది పీటీఐ వార్తా సంస్థ. ఈ సందర్భంగా కరోనా లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నాడు మయూర్ విహార్ వాసి.
"మీలో ఎవరికైనా కరోనా లక్షణాలుంటే ఇంట్లో కూర్చోకండి. వెంటనే వైద్యులను సంప్రదించండి. నాలో కరోనా లక్షణాలు కనిపించినప్పుడు గత నెల 26న నేను ఆసుపత్రికి వెళ్లి మాత్రలు తెచ్చుకున్నా. నా కుమారుడి పుట్టిన రోజు వేడుకలో పాల్గొన్నా. ఆ తర్వాత నాకు కరోనా సోకిందని తెలిసింది. అయితే, ఆ వేడుకకు హాజరైన వారందరికీ కరోనా పరీక్షలు నిర్వహించారు. దేవుడి దయ వల్ల ఎవరికీ కరోనా సోకలేదు. ఇప్పుడు వైద్యులు నా మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలని సూచిస్తున్నారు."
-కరోనా బాధితుడు
అంతే కాదు, ఐసోలేషన్ గదిలో తనకెలాంటి ఇబ్బంది లేదని తెలిపాడు. వైద్యుల పర్యవేక్షణలో తాను ఆనందంగా ఉన్నానని స్పష్టం చేశాడు.
"నేను ఓ ప్రత్యేక గదిలో ఉంటున్నాను. ఇందులో ఏసీతో పాటు, అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ఎండ తగలడానికి కిటికీలు కూడా ఉన్నాయి. సినిమాల్లో చూపించినట్టుగా నేనేమీ అంధకార గదిలో బందీగా లేను. ఇక్కడంతా చాలా పరిశుభ్రంగా ఉంది. వైద్యులు నాపై శ్రద్ధ వహిస్తున్నారు. కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ నాకు ఫోన్ చేసి ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు. హోలీ శుభాకాంక్షలు తెలిపారు. నేను నా మొబైల్ నుంచి వీడియోకాల్ చేసి, కుటుంబసభ్యులతో మాట్లాడతాను. ఇప్పుడు నాలో ఆధ్యాత్మికత పెరిగింది."
-కరోనా బాధితుడు
ఇదీ చదవండి:కరోనా భయంతో స్వీయ నిర్బంధంలో కేంద్రమంత్రి!