భారతావని ఏళ్లతరబడి ఎదురుచూసిన రామ మందిర నిర్మాణం ప్రారంభమైంది. ఆగస్టు 5న అయోధ్యలో భూమి పూజ కార్యక్రమం కనులపండువగా జరగగా.. తాజాగా ఆలయ నిర్మాణ పనులు మొదలయ్యాయి.
మందిరం నిర్మించే ప్రదేశంలో మట్టి నమూనాలను ఇంజినీర్లు పరిశీలిస్తున్నారని శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ట్వీట్ చేసింది. సీబీఆర్ఐ, ఐఐటీ మద్రాస్, ఎల్ అండ్ టీ సంస్థకు చెందిన ఇంజినీర్లు ఇందులో పాల్గొన్నారని తెలిపింది. ఆలయ నిర్మాణం 36 నుంచి 40 నెలల్లో పూర్తవుతుందని అంచనా వేసింది.
భారత ప్రాచీన సంప్రదాయాలు, నిర్మాణ పద్ధతులను ఉపయోగించి రామ మందిరాన్ని నిర్మించనున్నట్లు ట్రస్ట్ పేర్కొంది. భూకంపాలు, సునామీలు వంటి ప్రకృతి విపత్తులు వచ్చినా తట్టుకొని నిలబడే విధంగా ఆలయాన్ని రూపొందిస్తున్నట్లు వెల్లడించింది. మందిర నిర్మాణంలో ఇనుమును ఉపయోగించడం లేదని తీర్థ క్షేత్ర స్పష్టం చేసింది.
"మందిర నిర్మాణంలో బండరాళ్లను ఒకదానితో ఒకటి అనుసంధానించేందుకు రాగి ఫలకలు ఉపయోగించడం జరుగుతుంది. నిర్మాణం పూర్తి చేసేందుకు 18 అంగుళాల పొడవు, 30 మిల్లీ మీటర్ల వెడల్పు, 3 మిల్లీ మీటర్ల లోతైన రాగి ఫలకలు 10 వేల వరకు అవసరమవుతాయి. ఇలాంటి రాగి ఫలకలను దానం చేయాలని రామ భక్తులకు పిలుపునిస్తున్నాం."
-శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ట్వీట్
అయోధ్యలో నిర్మించ తలపెట్టిన రామ మందిరానికి ఆగస్టు 5న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఆ రాష్ట్ర గవర్నర్ ఆనందీబెన్ పటేల్, ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్, తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చదవండి-