మహారాష్ట్రలో విశ్వాస పరీక్షను పూర్తి చేసుకున్న శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ ప్రభుత్వం ఆదివారం జరిగే స్పీకర్ ఎన్నికకు సిద్ధమైంది. మూడు పార్టీల కూటమి తమ అభ్యర్ధిగా కాంగ్రెస్ శాసనసభ్యుడు నానా పటోలే పేరును ప్రకటించగా, భాజపా కూడా పోటీకి సిద్ధమైంది. భాజపా తమ అభ్యర్ధిగా కిసాన్ కాథోర్ పేరును ప్రకటించింది.
పటోలే విదర్భలోని సాకోలీ నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కిసాన్ కాథోర్ ఠాణెలోని ముర్బాడ్ నుంచి భాజపా శాసనసభ్యునిగా ఉన్నారు. ఇద్దరూ నాలుగు సార్లు ఎమ్మెల్యేగా నెగ్గారు. స్పీకర్గా ఎలాంటి పోటీ లేకుండానే ఎన్నికవుతానని ధీమా వ్యక్తం చేశారు నానా పటోలే.
''ప్రజాస్వామ్య ప్రభుత్వంలో.. అభ్యర్థిని బరిలోకి దింపే హక్కు వారికి(భాజపా)కు ఉంది. అయితే.. మహారాష్ట్రలో ఒక సంప్రదాయం ఉంది. స్పీకర్ ఎన్నిక ఎలాంటి పోటీ లేకుండా జరుగుతుంది. ఈసారీ అలాగే జరుగుతుందని నమ్ముతున్నా.''
- నానా పటోలే, కాంగ్రెస్ ఎమ్మెల్యే, స్పీకర్ అభ్యర్థి
బలపరీక్షలో సులువుగానే...
శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ నేతృత్వంలో ఏర్పాటైన ఉద్ధవ్ ప్రభుత్వానికి శనివారం విశ్వాస పరీక్ష నిర్వహించగా సులువుగానే నెగ్గింది. సభ నుంచి 105 మంది భాజపా ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారు. మొత్తం 288 సీట్లు ఉన్న మహారాష్ట్ర అసెంబ్లీలో మెజార్టీకి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 145 కాగా.. ఉద్ధవ్ సర్కార్‌కు 169 ఓట్లు వచ్చాయి.
ప్రస్తుతం తాత్కాలికంగా సభా కార్యకలాపాలు నిర్వహించేందుకు ఎన్సీపీ ఎమ్మెల్యే దిలీప్ వాల్సే పాటిల్ ప్రొటెం స్పీకర్గా ఉన్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు ముందు భాజపా ఎమ్మెల్యే.. కాళిదాస్ కొలంబ్కర్ ఆ బాధ్యతలు నిర్వర్తించారు.
శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ నేతృత్వంలోని 'మహా వికాస్ అఘాడీ' ఈ నెల 28న ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. పదవుల పంపకాల్లో భాగంగా ముఖ్యమంత్రి పదవి శివసేనకు దక్కగా ఉప ముఖ్యమంత్రి పదవి ఎన్సీపీకి దక్కనుంది. తాజాగా స్పీకర్ పదవిని కాంగ్రెస్‌కు కేటాయించారు.
ఇదీ చూడండి: యువ వైద్యురాలి హత్యపై దిల్లీలోనూ ఆందోళనలు