మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలకు ముహూర్తం సమీపిస్తోంది. ముఖ్యమంత్రి పీఠాన్ని నిలబెట్టుకోవాలని భాజపా.., ఎలాగైనా ఈసారి అధికారాన్ని చేజిక్కించుకోవాలని కాంగ్రెస్ పార్టీ.. హోరాహోరీగా ప్రచారాలు సాగిస్తున్నాయి. ఓటర్లను ఆకర్షించేలా మేనిఫెస్టోలు విడుదల చేశాయి.
మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత పృథ్వీరాజ్ చవాన్.. శాసనసభ ఎన్నికల్లో హస్తం పార్టీ మంచి ఫలితాలు సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. లోక్‌సభ ఎన్నికలతో పోలిస్తే.. అసెంబ్లీ పోరులో మెరుగైన స్థితిలో ఉంటామని ఈటీవీ భారత్ ముఖాముఖిలో తెలిపారు.
ప్ర. కొన్ని నెలల క్రితం జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్రలోని 48 పార్లమెంట్ స్థానాలకుగానూ కాంగ్రెస్ కేవలం ఒక్కచోటే నెగ్గింది. ఈ తరుణంలో అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ విజయావకాశాలు ఎంత వరకు ఉన్నాయంటారు?
జ. జాతీయభద్రత, జాతీయవాదంపై 2019 లోక్‌సభ ఎన్నికలు జరిగాయి. పాకిస్థాన్‌పై పోరాడేందుకు తానే సరైన వ్యక్తినని ప్రజలను ఒప్పించడంలో నరేంద్రమోదీ విజయం సాధించారు. నిజానికి 1971లోనే అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ.. పాకిస్థాన్‌పై సమరశంఖం పూరించి, బంగ్లాదేశ్‌ను ఏర్పాటు చేసి పాక్‌కు గుణపాఠం చెప్పారు. కానీ, ప్రస్తుత కాంగ్రెస్‌లో అలనాటి నాయకులు లేరు. అంతా కొత్త తరం నేతలున్నారు. ప్రస్తుత ఎన్నికలు ప్రధానంగా ప్రాంతీయ సమస్యలపైనే జరుగుతున్నాయి.
ప్ర. ఎన్నికలకు ముందు జరుగుతున్న పొత్తులు కాంగ్రెస్ విజయానికి సాయపడతాయా?
జ. గత శాసనసభ ఎన్నికల్లో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)తో మాకు ఎలాంటి పొత్తు లేదు. కానీ, ఈ ఎన్నికల్లో మాలాగే ఆలోచించే అనేక పార్టీలతో కలిసి ఎన్నికలకు సిద్ధమయ్యాం. ప్రకాశ్ అంబేడ్కర్ 'వంచిత్ బహుజన్ అఘాది', ఏఐఎంఐఎం పార్టీల వల్ల కాంగ్రెస్ ఓట్లు చీలిపోయే ప్రమాదమేమీ లేదు. 2014లోనూ ఈ రెండు పార్టీలతో కలిసే బరిలోకి దిగాం. వారు విడిగానే పోటీ చేస్తారు. లోక్‌సభ ఎన్నికల కంటే కాంగ్రెస్‌కు ఈసారి చాలా మంచి అవకాశాలున్నాయి. ప్రత్యేకించి నైరుతి, విదర్భ ప్రాంతాల్లో కాంగ్రెస్ తన మార్కు చూపిస్తుంది.
ప్ర. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్-ఎన్సీపీ కలిసి ఒకే మేనిఫెస్టోను విడుదల చేసినందున.. ఆ రెండు పార్టీలు విలీనమవుతాయనే ఊహాగానాలు జోరందుకున్నాయి. దీనిపై మీ స్పందన?
జ. మంచిది. ఇవన్నీ కేవలం వదంతులే. విలీనానికి సంబంధించిన నిర్ణయాలు కేవలం ఎన్నికల తర్వాతే తీసుకుంటాం. అది కూడా ఫలితాల మీదే ఆధారపడి ఉంటుంది. నాయకత్వ సమస్యే రెండు పార్టీల మధ్య ప్రధానంగా ఉంది. అది ఇంకా పరిష్కారం కాలేదు. ఈ సమస్యతోనే గతంలో కాంగ్రెస్ నుంచి ఎన్సీపీ వైదొలిగింది.
ప్ర. కాంగ్రెస్ ఎన్ని సీట్లు సాధిస్తుందని అనుకుంటున్నారు?
జ. అలా ఊహించడం నాకు ఇష్టం ఉండదు.
ప్ర. కాంగ్రెస్ ప్రచారంలో ఏఏ అంశాలు ప్రధానంగా ఉండనున్నాయి?
జ. భాజపా ప్రభత్వ వైఫల్యాలు, నిరుద్యోగం, వ్యవసాయ సమస్యలు, రైతుల ఆత్మహత్యలు, ఎగుమతుల తగ్గుదల, అభివృద్ధి క్షీణత, ఫడణవీస్ ప్రభుత్వ అవినీతిపై ప్రధానంగా దృష్టి పెట్టాం. భాజపా.. ప్రాంతీయ సమస్యలను పక్కనబెట్టి... సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ముందు పెండింగ్‌లో ఉన్న ఆర్టికల్ 370 రద్దుపై ప్రచారం చేసుకుంటోంది. మేము బన్ను, జున్ను సమస్యల గురించి మాట్లాడుతుంటే.. కమళదళ నేతలు మాత్రం భావోద్వేగాలతో ముడిపడిన అంశాలను లేవనెత్తుతున్నారు.
ప్ర. పార్టీ తరఫున రాహుల్‌గాంధీ ప్రచారం చేయనున్నారు. అధ్యక్షురాలు సోనియాగాంధీ కూడా వస్తారా?
జ. ఆరోగ్య సమస్యలతో తాను ప్రయాణం చేయలేనని సోనియా చెప్పారు. అందుకే ఈ విషయంపై నాకు కూడా స్పష్టత లేదు.
ప్ర. రాష్ట్రంతో పాటు ముంబయి కాంగ్రెస్ యూనిట్లలో కొనసాగుతున్న గొడవలపై మీ వ్యాఖ్యలు?
జ. పార్టీ నేతల మధ్య ఆ స్థాయిలో విభేదాలు లేవని అనుకుంటున్నాను.
ప్ర. ముంబయిలో ఎక్కువ స్థానాల్లో గెలుపొందేందుకు ఏమైనా ప్రణాళికలు రచిస్తున్నారా?
జ. ర్యాలీలకు ఎక్కువ మంది ప్రజలు వచ్చేలా చూసుకోవాలి. కానీ కాలం మారింది. ర్యాలీలకు ఎక్కువ మంది ఓటర్లు హాజరుకావట్లేదు. ఎన్సీపీతో కలిసి ర్యాలీలు నిర్వహిస్తే జనాలు అధిక సంఖ్యలో వచ్చే అవకాశముంది. కానీ, ఇరుపార్టీలకు అంతర్గతంగా కొన్ని సమస్యలున్నాయి.
ప్ర. ఓటర్లను ప్రభావితం చేసేందుకు ముఖ్యమంత్రిగా మీ పదవీకాలం ఎలా ఉపయోగపడుతుందని అనుకుంటున్నారు.
జ. మరాఠా, ముస్లింల రిజర్వేషన్, పరిపాలనా విభాగంలో ప్రక్షాళన, పేదలు, మహిళల సాధికారత వంటివి నా హయాంలోని ప్రధానాంశాలే. ప్రచారంలో వీటి గురించి ఓటర్లకు తెలియజేస్తాం.
ప్ర. లోక్‌సభ ఎన్నికలకు ముందు కనీస ఆదాయ హామీ పథకం(న్యాయ్)పై రాహుల్ గాంధీకి సలహా ఇచ్చిన ఆర్థికవేత్త అభిజిత్ బెనర్జీకి నోబెల్ బహుమతి లభించింది. అది కాంగ్రెస్ ప్రయత్నానికి నిరూపణగా భావిస్తున్నారా?
జ. సలహా ఇవ్వడం, విజేతగా నిలిచి అవార్డు గెలవడం రెండు వేర్వేరు అంశాలు. ఒక పథకాన్ని అమలు చేసినప్పుడే అది మంచిదో, కాదో తెలుస్తుంది. అందుకు అధికారంలో ఉండాలి.