కాంగ్రెస్ సామాజిక మాధ్యమ ఇన్‌ఛార్జి దివ్య స్పందన ట్విట్టర్ ఖాతా కొత్త చర్చకు దారితీసింది. ట్విట్టర్ ఖాతాలో వృత్తి అనే చోట తన హోదా వివరాలు తీసేయడం, పోస్ట్‌లను తొలగించడంపై రాజకీయ వర్గాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. కాంగ్రెస్ సామజిక మాధ్యమ విభాగం ఇంఛార్జి దివ్య స్పందన కాంగ్రెస్‌ను వీడారా.. పార్టీనే సామాజిక మాధ్యమ బాధ్యతల నుంచి ఆమెను తప్పించిందా.. అని ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
ఇప్పటికీ సామాజిక మాధ్యమాల బాధ్యులుగా దివ్య స్పందనే కొనసాగుతున్నారా.. పార్టీ మరెవరినైనా నియమించిందా అనే విషయంలో సందిగ్ధత నెలకొంది. ఈ విషయమై కాంగ్రెస్ వర్గాల నుంచి గానీ, దివ్య స్పందన నుంచి గానీ ఎలాంటి ప్రకటనా విడుదల కాలేదు.
కొద్ది రోజులుగా కాంగ్రెస్ సామాజిక మాధ్యమ బృందం నుంచి దివ్య దూరంగా ఉంటున్నారని సమాచారం. ఈ విషయమై ఆమె వద్ద ప్రస్తావన తీసుకురాగా మీకు వచ్చిన సమాచారం సరికాదని సమాధానాన్ని దాటవేస్తున్నారు దివ్య. ఈ ప్రశ్నలకు కాంగ్రెస్ వర్గీయులూ సమాధానాలు దాటవేస్తున్నారు.
లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి నేపథ్యంలో నెలరోజులపాటు ఎలాంటి చర్చలు, టెలివిజన్ కార్యక్రమాల్లో కాంగ్రెస్ నేతలు పాల్గొనరని అధికారికంగా ప్రకటించింది కాంగ్రెస్. పార్టీ నిర్ణయానికనుగుణంగా తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్‌లను దివ్య తొలగించారా అనేది తెలియాల్సి ఉంది.
ఇదీ చూడండి: ప్రతిభా పాటిల్‌కు మెక్సికో అత్యున్నత పురస్కారం