పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా దిల్లీలో ఆందోళన చేపట్టిన విద్యార్థులపై పోలీసుల లాఠీ ఛార్జిని కాంగ్రెస్ వ్యతిరేకించింది. ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శలు గుప్పిస్తూ ఎదురుదాడి చేసింది. ఝార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న ప్రధాని.. దిల్లీ హింసాకాండపై స్పందించకపోవటం దారుణమంది. పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా అల్లర్లు జరుగుతున్న నేపథ్యంలో దేశంలో శాంతిభద్రతలను కాపాడటంలో కేంద్రం విఫలమైందని ఆరోపించింది. ఈశాన్య రాష్ట్రాల్లో మొదలైన అల్లర్లు, ఆ తర్వాత బంగాల్ నుంచి దిల్లీకి వ్యాపించాయని ట్వీట్ చేసింది. దిల్లీ అల్లర్లపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేసింది.
ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ... ప్రధాని మోదీపై విమర్శనాస్త్రాలు సంధించారు. పౌరసత్వ చట్టంపై ప్రజాభిప్రాయాన్ని వినేందుకు కేంద్రం భయపడుతోందని, విద్యార్థుల సాహసాన్ని, ధైర్యాన్ని నియంతృత్వ చర్యల ద్వారా అణిచివేసే ప్రయత్నం చేస్తోందని ఆరోపిస్తూ ట్వీట్ చేశారు. యువకుల మాటను.... ప్రధాని మోదీ ఇవాళ కాకపోయిన తర్వాత అయినా వినకతప్పదని ప్రియాంక అభిప్రాయపడ్డారు
ఇదీ చూడండి : అట్టుడుకుతున్న దిల్లీ... ఘర్షణల్లో 40మందికి గాయాలు