మే 29న కాంగ్రెస్ ప్లీనరీ, ఏఐసీసీ అధ్యక్ష ఎన్నిక జరపాలని పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సీడబ్ల్యూసీ సమావేశంలో ప్రతిపాదించినట్లు సమాచారం. పార్టీ అధ్యక్ష ఎన్నికకు సంబంధించి కూడా సీనియర్ నేత మధుసూదన్ మిస్త్రీ నేతృత్వంలోని ఈ కమిటీ కొన్ని సిఫారసులు చేసింది.
పార్టీ అధ్యక్షురాలు సోనియా అధ్యక్ష ప్రసంగంతో కాంగ్రెస్ అత్యున్నత నిర్ణయాక మండలి-సీడబ్ల్యూసీ సమావేశం వర్చువల్ పద్ధతిలో ప్రారంభమైంది. ప్రసంగం అనంతరం పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ ప్రాతిపాదించిన షెడ్యూల్‌ను చదివి వినిపించాలని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ను సోనియా కోరారు. మే 29న ప్లీనరి, ఏఐసీసీ అధ్యక్ష ఎన్నిక నిర్వహించాలని కమిటీ ప్రతిపాదించినట్లు ఆయన తెలిపారు. ఈ షెడ్యూల్‌నే సీడబ్ల్యూసీ ఆమెదిస్తుందని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.
రైతుల ఆందోళనల నేపథ్యంలో దేశంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపైనా అధినాయకత్వం చర్చించినట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. బడ్జెట్ సమావేశాల సందర్భంగా పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహాలపైనా చర్చ జరిగినట్లు పేర్కొన్నాయి.
మూడు తీర్మానాలు..
సీడబ్ల్యూసీ సమావేశంలో కాంగ్రెస్ సభ్యులు మూడు తీర్మానాలు చేశారు.
- సాగుచట్టాలను కేంద్రం వెంటనే రద్దు చేయాలి.
- అర్ణబ్ గోస్వామికి సంబంధించిన వ్యవహారంపై సంయుక్త పార్లమెంట్ కమిటీ విచారణ జరపాలి.
- కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎన్నిక జరిపి ఈ ఏడాది జూన్ నాటికి పార్టీకి నూతన అధ్యక్షుడిని తీసుకురావాలి.
కేంద్రంపై ధ్వజం..
సమావేశంలో కేంద్రంపై విమర్శలతో విరుచుకుపడ్డారు సోనియా గాంధీ. రైతు సమస్యల పట్ల కేంద్రం దురహంకార వైఖరితో వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. రైతులతో ఎన్నిసార్లు చర్చలు జరిపినా.. సమస్యల పరిష్కారం దిశగా ప్రయత్నించడం లేదని మిమర్శించారు. ప్రభుత్వ ఆర్థిక విధానాలను కూడా సోనియా తప్పుబట్టారు. ప్రమాదకర ప్రైవేటీకరణలో ప్రభుత్వం చిక్కుకుపోయిందన్నారు.
త్వరలో బడ్జెట్ సమావేశాలు ప్రారంభకానున్న నేపథ్యంలో పార్లమెంటులో లేవనెత్తాల్సిన అంశాలు చాలా ఉన్నాయని సమావేశంలో సోనియా తెలిపారు. ప్రజా సమస్యలపై సభలో చర్చించాల్సిన అవసరముందన్నారు. అయితే చర్చలకు కేంద్రం సానుకూలంగా ఉంటుందో లేదో తెలియదన్నారు.
అర్ణబ్ వాట్సాప్ సంభాషణల లీక్ అంశంపైనా సీడబ్ల్యూసీ సమావేశంలో చర్చ జరిగింది. దేశ భద్రతకు సంబంధించిన విషయాల్లో కేంద్రం రాజీపడటం బాధాకరమని సోనియా అన్నారు.