దేశభక్తి విషయంలో భాజపా, ఆర్ఎస్ఎస్ సర్టిఫికేట్లు కాంగ్రెస్‌కు అవసరం లేదని మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ వ్యాఖ్యానించారు. ఆర్టికల్ 370 రద్దును కాంగ్రెస్ సమర్థించిందని, అయితే భాజపా దూకుడు వ్యవహారాన్నే వ్యతిరేకిందని ఆయన స్పష్టం చేశారు. ముంబయిలో ఎన్సీపీ నేత శరద్‌పవార్‌తో కలిసి ఓ మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
మన్మోహన్ సింగ్, ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ హయాంలో బ్యాంకింగ్ రంగం దిగజారిందన్న ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ వ్యాఖ్యలను మాజీ ప్రధాని తప్పుబట్టారు.
"ఆర్థిక మందగమనం, ప్రభుత్వ ఉదాసీనత, అసమర్థత... లక్షలాదిమంది ప్రజల భవిష్యత్తు, ఆకాంక్షలపై ప్రభావం చూపుతున్నాయి. భాజపా ఓట్లడిగే సమయంలో ప్రచారం చేసిన డబుల్ ఇంజిన్ మోడల్ విధానం విఫలమైంది. కేంద్రం అనుసరించిన ఎగుమతి, దిగుమతుల విధానం రైతుల్ని ఇబ్బందులకు గురిచేసింది. ఐతే... దురదృష్టవశాత్తూ ప్రజాప్రయోజన విధానాలను అనుసరించేందుకు భాజపా ప్రభుత్వం సిద్ధంగా లేదు. సమస్యకు పరిష్కారాలను అన్వేషించే బదులు ప్రభుత్వం ప్రత్యర్థులపై నిందలు మోపడంలో నిమగ్నమైంది."
- మన్మోహన్ సింగ్, మాజీ ప్రధాని
హిందుత్వ సిద్ధాంతానికి మాత్రమే వ్యతిరేకం
వీర్ సావర్కర్‌కు భారతరత్న అందిస్తామని భాజపా హామీలు ఇస్తుండడంపై మన్మోహన్ సింగ్ స్పందించారు. కాంగ్రెస్ సావర్కర్ హిందూత్వ సిద్ధాంతాలను మాత్రమే వ్యతిరేకిస్తుందని స్పష్టం చేశారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ సావర్కర్ తపాలా బిళ్ల విడుదల చేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.
ఎన్డీఏ తెస్తున్న పౌరసత్వ సవరణ బిల్లును కూడా కాంగ్రెస్ వ్యతిరేకిస్తోందని మన్మోహన్సింగ్ స్పష్టంచేశారు. ఎన్ఆర్సీ విషయంలోనూ ఆయన అభ్యంతరాలు వ్యక్తం చేశారు.
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ లాంటి దర్యాప్తు సంస్థలను మోదీ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు చర్యలకు వాడుకోకూడదని మన్మోహన్ హితవుపలికారు.
ఇదీ చూడండి: 'ఇది కార్యశక్తి.. స్వార్థశక్తికి మధ్య జరిగే పోరు'