కన్నడ నాట రాజకీయ సంక్షోభం ముగిసినట్లే అనిపించినా ఇంకా అనిశ్చితి కొనసాగుతోంది. ప్రభుత్వ ఏర్పాటుకు, ప్రమాణ స్వీకారానికి అవకాశం ఇవ్వాలని గవర్నర్ వాజూభాయ్ వాలాను కలిశారు బీఎస్ యడ్యూరప్ప. గవర్నర్ అంగీకరించగా... ఈ సాయంత్రం 6 గంటలకు ప్రమాణం చేయనున్నారు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు. అసెంబ్లీలో బలం నిరూపించుకునేందుకు జులై 31 వరకు గడువిచ్చారు వాజుభాయ్.
తాజా పరిణామాల నడుమ భాజపా అధికారంలోకి వచ్చినా.. ప్రభుత్వం ఎన్ని రోజులు కొనసాగుతుందన్న అంశంపై సందిగ్ధం కొనసాగుతోంది.
111 మంది మద్దతు..?
ముఖ్యమంత్రిగా ఈ రోజు యడ్యూరప్ప ప్రమాణం చేస్తారు. జులై 31లోగా బలనిరూపణ చేసుకోవాల్సి ఉంటుంది. కర్ణాటక స్పీకర్ గురువారం ముగ్గురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసిన కారణంగా.. అసెంబ్లీలో శాసనసభ్యుల సంఖ్య సభాపతిని మినహాయించి 220కి చేరింది. మెజారిటీకి 111 మంది సభ్యుల మద్దతు అవసరం.
ప్రస్తుతం భాజపాకు స్వతంత్ర ఎమ్మెల్యే నగేశ్ మద్దతుతో కలిపి 106 మంది శాసనసభ్యుల బలం ఉంది. ప్రభుత్వం విశ్వాసం నిలబెట్టుకోవాలంటే మరో ఐదుగురి మద్దతు అవసరం.
వేటు వేసినా.. ఆమోదించినా..!
రాజీనామా చేసిన 14 మంది రెబల్స్‌పై స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఒకవేళ.. వీరిపై అనర్హత వేటు వేసినా.. రాజీనామాలు ఆమోదించినా... అసెంబ్లీలో సభ్యుల సంఖ్య 204కు చేరుతుంది. అప్పుడు మెజార్టీకి అవసరమైన మ్యాజిక్ సంఖ్య 103తో భాజపా ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమం అవుతుంది.