భారత్‌కు రానున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో భేటీలో హెచ్1బీ వీసా, ప్రధాన్య వాణిజ్య హోదా(జీఎస్పీ) పునరుద్ధరణ వంటి సమస్యల్ని ప్రధాని నరేంద్ర మోదీ లేవనెత్తుతారా అని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించింది. అమెరికా ప్రయోజనాలే తొలి ప్రాధాన్యం అని ఓవైపు ట్రంప్ వాదిస్తుంటే ‘ఇండియా ఫస్ట్’ అన్న విధానంపై మోదీ ఎందుకు మౌనం వహిస్తున్నారని అడిగింది. ట్రంప్ పర్యటన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సూర్జేవాలా పలు ప్రశ్నలు సంధించారు.
ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఇరాన్‌పై అగ్రరాజ్యం అనేక ఆంక్షలు విధించింది. అందులో భాగంగా ఇరాన్ నుంచి చమురు కొనుగోలు చేయొద్దన్న నిబంధనను కూడా ఉంచింది. ఈ నేపథ్యంలో ఇరాన్ నుంచి దిగుమతిని నిలిపివేస్తే.. ఆ స్థానంలో అమెరికా సరఫరా చేస్తుందా అని రణ్‌దీప్ ప్రశ్నించారు. ఆ మేరకు ట్రంప్ నుంచి మోదీ భరోసా రాబట్టగలరా అని అడిగారు. అలాగే, అమెరికా నుంచి మూడు బిలియన్ డాలర్ల రక్షణ ఉత్పత్తుల కొనుగోలు ఒప్పందానికి భారత్ సంసిద్ధంగా ఉన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో ప్రతిఫలంగా భారత స్టీల్ ఎగుమతులపై అగ్రరాజ్యం ఏమైనా ప్రోత్సాహకాలు కల్పించేందుకు సిద్ధంగా ఉందా? అని ప్రశ్నించారు. ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత పెంచిన సుంకాల వల్ల భారత స్టీల్ ఎగుమతులు 50శాతం మేర పడిపోయాయన్నారు. అలాగే హెచ్1బీ వీసాల జారీ విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్న ట్రంప్.. నిబంధనల్ని సరళతరం చేసే అవకాశాలేమైనా ఉన్నాయా అని అడిగారు.
భారత్ ఎదుర్కొంటున్న భద్రతాపరమైన సవాళ్లపై ట్రంప్‌తో చర్చించే అవకాశాలున్నాయా?1974 నుంచి కొనసాగుతూ వచ్చిన జీఎస్పీ హోదా 2019తో ముగిసింది. దీని వల్ల 5.6 బిలియన్ డాలర్ల ఎగుమతుపై ప్రభావం పడింది. ‘నమస్తే ట్రంప్’ కార్యక్రమం జీఎస్పీ పునరుద్ధరణకు దోహదం చేస్తుందా’’ అంటూ సూర్జేవాలా మోదీకి పలు ప్రశ్నలు సంధించారు.