చమురు ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకం పెంపుపై కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా విమర్శనాస్త్రాలు సంధించింది కాంగ్రెస్. అంతర్జాతీయ మార్కెట్లో తగ్గిన పెట్రో ఉత్పత్తుల ధరల ప్రయోజనాన్ని ప్రజలకు కల్పించాలని కోరింది. ఈ మేరకు కాంగ్రెస్ అధికార ప్రతినిధి అజయ్ మాకెన్ ప్రకటన విడుదల చేశారు. పెట్రోల్, డీజిల్, ఎల్పీజీలపై 35 నుంచి 40 శాతం మేర ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు.
తాజా వడ్డింపుతో పెట్రోల్‌పై ఎక్సైజ్ సుంకం రూ. 22.98కు పెరగగా.. డీజిల్‌పై ఈ మొత్తం రూ. 18.83కు వృద్ధి చెందిందని పేర్కొన్నారు. 2014లో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు పెట్రోల్‌పై ఎక్సైజ్ సుంకం రూ. 9.48, డీజిల్‌పై రూ. 3.56గా ఉండేవని గుర్తు చేశారు. భాజపా సర్కారు అధికారంలోకి వచ్చాక డజను సార్లు కేంద్ర ఎక్సైజ్ పన్నును పెంచారని ఆరోపించారు.
"మోదీ, షా ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాలు, ఇతర పన్నులను పెంచి ప్రజలను దోపిడి చేస్తోంది. గత ఆరేళ్లలో ముడి చమురు ధరలు 50 శాతం తగ్గినా కేంద్ర ప్రభుత్వ దారితెన్నూ లేని విధానాల వల్ల పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ సిలిండర్ ధరలు భారీగా పెరిగాయి. పెట్రో ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తేవాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తున్నప్పటికీ ప్రభుత్వం ఈ దిశగా నిర్ణయం తీసుకోవడం లేదు. "
-అజయ్ మాకెన్, కాంగ్రెస్ అధికార ప్రతినిధి
ప్రభుత్వం నేడు పెట్రోల్ ఉత్పత్తులపై పన్నులను రూ. 3 మేర పెంచింది. తాజా పెంపు కారణంగా రూ. 39వేల అదనపు ఆదాయం ప్రభుత్వానికి సమకూరనుంది.
ఇదీ చూడండి: పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకం రూ.3 వడ్డింపు