సీఎం కమల్‌నాథ్ నేతృత్వంలోని ప్రభుత్వం రైతు రుణమాఫీ చేయలేదని మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, భాజపా నేత శివరాజ్‌సింగ్ చౌహాన్ చేసిన ఆరోపణలను కాంగ్రెస్ తీవ్రంగా ఖండించింది. అధికారంలోకి వచ్చిన ఆరుమాసాల్లోనే దాదాపు 21 లక్షల మంది రైతుల రుణాలను మాఫీ చేశామని తెలిపారు హస్తం పార్టీ నేతలు.
కాంగ్రెస్ నేత సురేష్ పచౌరీ ఆధ్వర్యంలోని బృందం మంగళవారం రెండు వాహనాల్లో రుణమాఫీ పత్రాలను తీసుకెళ్లి మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ చౌహాన్ నివాసం ముందు గుమ్మరించింది. అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు రైతుల రుణాలు మాఫీ చేశామని... వాస్తవిక స్థితి, వివరాలు తెలిపేందుకే చౌహాన్ ఇంటికి పత్రాలు తీసుకొచ్చామని వారు తెలిపారు.
కాంగ్రెస్ రైతులను మోసం చేసింది
కాంగ్రెస్ వాదనలను భాజపా సీనియర్ నేత, మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ కొట్టిపడేశారు. వారు చూపించిన రుణమాఫీ ధ్రువపత్రాలు అబద్దాల పుట్టగా అభివర్ణించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం నిజానికి రూ.48 వేల కోట్ల మేరకు రైతుల రుణాలు మాఫీ చేయాల్సి ఉందని, కేవలం రూ.13 వేల కోట్లు మాత్రమే మాఫీ చేసిందని చౌహాన్ వివరించారు.
"గత సంవత్సరం జరిగిన శాసనసభ ఎన్నికలకు ముందు, అధికారంలోకి వచ్చిన 10 రోజుల్లోనే రైతుల రుణాలను పూర్తిగా మాఫీ చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చాక పేద రైతులను హస్తం పార్టీ మోసం చేసింది." -శివరాజ్ సింగ్ చౌహాన్, మధ్యప్రదేశ్ మాజీ సీఎం
ఎన్నికల కోడ్ వల్లే..
రైతు రుణమాఫీ విషయంలో చౌహాన్ ఆరోపణలు సరికాదని కాంగ్రెస్ అధికార ప్రతినిధి భూపేంద్ర గుప్త అన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్న కారణంగానే రుణమాఫీ ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేశామని తెలిపారు.
ఇదీ చూడండి: వీవీప్యాట్ స్లిప్పులపై ఈసీని కలిసిన విపక్షాలు