కర్తార్‌పుర్ నడవా ప్రారంభోత్సవానికి ఇంకా రెండు రోజులే ఉంది. అక్కడి దర్బార్ సాహిబ్ పుణ్యక్షేత్రాన్ని సందర్శించే యాత్రికులకు పాస్‌పోర్ట్ అవసరమా? లేదా? అనే విషయంపై పాకిస్థాన్ నుంచి మిశ్రమ స్పందనలు అందుతున్నట్టు భారత్ తెలిపింది.
యాత్రికుల సందర్శనకు సంబంధించిన విధి విధానాలపై రెండు దేశాల మధ్య ఒప్పందం ఇప్పటికే కుదిరిందని భారత విదేశీ వ్యవహారాల అధికార ప్రతినిధి రవీశ్ కుమార్ పునరుద్ఘాటించారు. ఈ ఒప్పందానికి భారత్ కట్టుబడి ఉంటుందన్నారు. ఒప్పందానికి ఏకపక్షంగా సవరణలు చేయలేమని స్పష్టం చేశారు.
"పాకిస్థాన్ నుంచి మిశ్రమ స్పందనలు అందుతున్నాయి. కొన్నిసార్లు పాస్‌పోర్టు అవసరమని చెబుతారు. మరి కొన్నిసార్లు అవసరం లేదని చెబుతారు. ప్రస్తుతానికి ద్వైపాక్షిక ఒప్పందం ఉంది, ఇది అవసరమైన పత్రాలను పేర్కొంది"
-రవీశ్ కుమార్, విదేశాంగశాఖ అధికార ప్రతినిధి.
పాకిస్థాన్ తరఫున కర్తార్‌పుర్ నడవా ప్రారంభోత్సవానికి హాజరయ్యే భారత ప్రముఖుల జాబితాను పాక్ ఇంకా ధ్రువీకరించలేదని రవీశ్ తెలిపారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యే భారతీయ ప్రముఖులకు తగిన భద్రత కల్పించాలని పాక్‌ను కోరారు రవీశ్.
కర్తార్‌పుర్ యాత్రికులకు పాస్‌పోర్ట్ అవసరం లేదని, అయితే ఒప్పందం ప్రకారం పాస్‌పోర్ట్ అవసరమని పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఇటీవలే ట్వీట్ చేశారు. ఇప్పటివరకు స్పష్టత ఇవ్వలేదు.
ఇదీ చూడండి: 'అయోధ్య తీర్పు నేపథ్యంలో అప్రమత్తంగా ఉండండి'