శిథిలాల కింద చిక్కుకున్నవారి ప్రాణాలను కాపాడటమే తమ తొలి కర్తవ్యమని ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్ అన్నారు. చమోలీ జిల్లాలో జరిగిన ప్రమాదం హిమనీనదం బద్దలవ్వడం వల్ల జరిగింది కాదని, తాజాగా కురిసిన మంచు వల్లేనని తెలిపారు. 14 చదరపు కి.మీ పరిధిలో మంచు కురిసిందని చెప్పారు. మంచు ఏటవాలుగా కిందకు జారుకొని.. క్రమంగా భారీ వరదకు కారణమైందని 'ఈటీవీ భారత్'తో తెలిపారు.
అయితే, విపత్తుపై అధ్యయనం చేయడానికి శాస్త్రవేత్తలను కేంద్రం పంపించిందని తెలిపారు సీఎం రావత్. వరదకు గల కారణాలపై వాస్తవాలను కనిపెట్టాలని కోరినట్లు తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి విపత్తులను గుర్తించేందుకు ముందస్తు హెచ్చరిక వ్యవస్థను తయారు చేయొచ్చా? అని వారిని అడిగినట్లు చెప్పారు.
రిషిగంగ ప్రాజెక్టు పూర్తిగా ధ్వంసం
వరదలో ధ్వంసమైన తపోవన్ పవర్ ప్రాజెక్టు ఇంకా ప్రారంభం కాలేదని చెప్పారు సీఎం. రిషిగంగ ప్రాజెక్టు పూర్తిగా కొట్టుకుపోయిందని తెలిపారు. ఈ ప్రాజెక్టు సిద్ధం కావడానికి పది సంవత్సరాలకుపైగా సమయం పట్టిందని చెప్పారు. జల ప్రళయం కారణంగా అన్ని రకాల సమస్యలు తలెత్తాయని, అయితే ప్రజల ప్రాణాలను కాపాడటంపైనే మొదటిగా దృష్టిసారించామని స్పష్టం చేశారు.
అంతకుముందు విహంగ వీక్షణం ద్వారా ఘటనా స్థలాన్ని పరిశీలించారు రావత్. ప్రమాదంలో గాయపడ్డవారిని ఆస్పత్రికి వెళ్లి కలిశారు. బాధితులకు అన్ని రకాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
ఇవీ చదవండి: