ఇకపై పదో తరగతి విద్యార్థులకు ఒకే ధ్రువీకరణ పత్రం అందించడానికి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) నిర్ణయించింది. ప్రస్తుతం మార్కుల జాబితా, ధ్రువీకరణ పత్రాలను సీబీఎస్ఈ వేరు వేరుగా అందిస్తోంది. ఇప్పుడు ఒకే పత్రంలో అందిస్తామని తెలిపింది. పరీక్షల కమిటీ తీసుకొచ్చిన ఒకే పత్రం ప్రతిపాదనకు పాలకవర్గం ఇటీవలే ఆమోదం తెలిపింది.
" 2019 విద్యాసంవత్సరం నుంచి పదో తరగతి పరీక్షల మార్కులు, సర్టిఫికెట్ ఒకే ధ్రువీకరణ పత్రంలో అందిస్తాం. ఈ పత్రం సర్టిఫికేట్లా పనిచేస్తుంది. నకలు పత్రం పొందడానికి బోర్డు సూచించినట్టు అభ్యర్థులు అన్ని విధానాలను అనుసరించాలి" - సీనియర్ బోర్డు అధికారి.
క్లాస్-12 యథాతథం
ఇంటర్మీడియట్ విద్యార్థులకు వేరు వేరు పత్రాల విధానమే యథాతథంగా కొనసాగుతుందని తెలిపింది బోర్డు. మార్కుల జాబితా, ధ్రువీకరణ పత్రం వేరు వేరుగా అందించనున్నట్లు పేర్కొంది.
మార్కుల పెరుగుదల కోసం పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు కేవలం పరీక్ష రాసిన సబ్జెక్టు మార్కుల జాబితా మాత్రమే అందిస్తామని తెలిపింది. 2020 విద్యాసంవత్సరం నుంచి సప్లిమెంటరీ పరీక్షలకు హాజరయ్యేవారికి మూడు సార్లు పరీక్ష రాసే అవకాశం ఇవ్వనున్నట్లు తెలిపింది.