సుప్రీం కోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను పెంచాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీకి ఛీఫ్ జస్టిస్ రంజన్ గొగొయి లేఖ రాశారు. హైకోర్టు న్యాయమూర్తుల పదవీ విరమణ వయసు 65 ఏళ్లకు పెంచాలని కోరారు.
పెండింగ్ కేసుల పరిష్కారానికి గానూ రాజ్యాంగం ప్రకారం పరిమిత కాలానికి విశ్రాంత న్యాయమూర్తులను తిరిగి నియమించుకునే అవకాశాన్ని పరిశీలించాలని కోరారు. ఈ మేరకు మోదీకి 3 లేఖలు రాశారు సీజేఐ.
సుప్రీం కోర్టులో ఇప్పటికే 58,669 కేసులు పెండింగ్‌లో ఉండగా.. కొత్తగా దాఖలవుతున్న వాటితో ఆ సంఖ్య ఇంకా పెరుగుతోందన్నారు. న్యాయమూర్తుల కొరత వల్ల ముఖ్యమైన కేసులకు సంబంధించి రాజ్యాంగ ధర్మాసనాలు ఏర్పాటు చేయలేకపోతున్నట్లు తెలిపారు.
ప్రజలకు సత్వర న్యాయం అందించేందుకు, మరింత సమర్థంగా పనిచేసేందుకు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను పెంచే విషయాన్ని పరిశీలించాలని సీజేఐ కోరారు. ప్రస్తుతం 399 న్యాయమూర్తుల స్థానాలు ఖాళీగా ఉన్నాయన్నారు. వాటిని తక్షణమే భర్తీ చేయాల్సిన అవసరముందన్నారు.
- ఇదీ చూడండి: ఆర్థిక విధానాలపై ప్రధానికి నిపుణుల సలహాలు