కరోనా వైరస్ నేపథ్యంలో పూరీ జగన్నాథ్ రథయాత్రను రద్దు చేయాలన్న సుప్రీం ఆదేశాలను వ్యతిరేకిస్తూ దాఖలైన వ్యాజ్యాలపై విచారణ జరపడానికి సర్వోన్నత న్యాయస్థానం అంగీకరించింది. ఈ మేరకు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బోబ్డే నేతృత్వంలో త్రిసభ్య ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది.
అంతకుముందు.. ప్రజలు లేకుండానే రథయాత్రకు అనుమతినివ్వాలని సర్వోన్నత న్యాయస్థానాన్ని అభ్యర్థించింది కేంద్రం. ఎన్నో శతాబ్దాలుగా వస్తున్న సంప్రదాయాన్ని అడ్డుకోకూడదని పేర్కొంది. అందువల్ల యాత్రను రద్దు చేయాలన్న సుప్రీంకోర్టు ఆదేశాల్లో మార్పులు చేయాలని కోరింది. కేంద్రం వాదనలకు ఒడిశా ప్రభుత్వం మద్దతు పలికింది.
"ఇది కోట్లాది మంది ప్రజల నమ్మకానికి సంబంధించిన విషయం. రథయాత్ర మంగళవారం ప్రారంభం కాకపోతే.. సంప్రదాయాల ప్రకారం 12ఏళ్ల వరకు యాత్ర జరగదు."
-- తుషార్ మెహతా, సొలిసిటర్ జనరల్.
కరోనా వైరస్ కట్టడికి ప్రవేశపెట్టిన నిబంధనలను పాటిస్తూనే.. అవసరమైతే ఒడిశా ప్రభుత్వం ఒకరోజు పాటు కర్ఫ్యూ విధించవచ్చని తుషార్ మెహతా వెల్లడించారు.
కరోనా పరీక్షల్లో నెగెటివ్‌గా తేలిన సెబాయత్లు, పాండాలు యాత్రలో పాల్గొనవచ్చని తుషార్ మెహతా పేర్కొన్నారు. టీవీల్లో వచ్చే ప్రత్యక్ష ప్రసారాల ద్వారా భక్తులు జగన్నాథుని ఆశీర్వాదాలు పొందవచ్చన్నారు.
పూరీలో మంగళవారం నుంచి జగన్నాథ రథయాత్ర ప్రారంభం కావాల్సి ఉంది. ఈ ఉత్సవాల్లో పాల్గొనేందుకు ఏటా లక్షలాది మంది భక్తులు దేశనలుమూలల నుంచి వస్తారు.
ఇదీ చూడండి:- జగన్నాథుడి రథయాత్రకు గుజరాత్‌లోనూ బ్రేక్