బిహార్ శాసనసభ ఎన్నికల్లో.. కూటముల్లో సీట్ల కేటాయింపు కొత్త తలనొప్పులు సృష్టిస్తున్నాయి. అధికార పక్షం ఎన్డీఏలో ప్రధాన భాగస్వామిగా ఉన్న లోక్ జన్శక్తి పార్టీ(ఎల్జేపీ).. సందిగ్ధంలో పడింది. ఎన్డీఏతో కలిసి పోటీచేయాలా.. ఒంటరిగానే బరిలోకి దిగాలా అన్న అంశాలపై ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఎంపీ చిరాగ్ పాసవాన్ ఎటూ తేల్చుకోలేకపోతున్నారు.
ఈ నేపథ్యంలో... ఒకవేళ ఎన్డీఏ నుంచి బయటకొచ్చి వేరుగా పోటీ చేసేందుకే.. ఆసక్తి చూపిస్తే ఆంతర్గతంగా పార్టీలో చీలిక వచ్చే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు విశ్లేషకులు.
జేడీయూ వ్యూహాలు
ప్రస్తుతం పార్టీ తరుపున ఆరుగురు లోక్సభ సభ్యులున్నారు. వారిలో మెహబూబ్ అలీ కేసర్, వీనా దేవి, పశుపతి కుమార్ పరాస్, చందన్ సింగ్ ఎన్డీఏ పక్షానే బరిలో నిలిచారు. లేదంటే జేడీయూ కండువా కప్పుకునేవారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఇప్పటికే జేడీయూ... ఆపరేషన్ ఎల్జేపీ ప్రారంభించిందని, పాసవాన్ పార్టీలోని నేతలపై కన్నేసి పెట్టిందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
పార్టీలో చీలిక ?
మరోవైపు పార్టీ అధ్యక్షుడు చిరాగ్ పాసవాన్.. బిహార్లో ఎన్డీఏలోంచి బయటకు వచ్చి జేడీయూ పోటీ చేస్తున్న 143 స్థానాల్లోనూ అభ్యర్థులను నిలబెట్టాలనే ఆలోచనలో ఉన్నారు. అయితే పార్టీలోని నలుగురు ఎంపీలు ఈ నిర్ణయం పట్ల అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్ణయం పార్టీకి నష్టం చేస్తుందనే భావనలో ఉన్నారు.
ఈ నేపథ్యంలో చిరాగ్ నిర్ణయం.. పార్టీలో చీలిక తెచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. చిరాగ్ చిన్నాన్న పశుపతి పరాస్ సైతం ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఇందుకు ప్రధాన కారణం.. సరైన ప్రణాళిక లేకపోడమేనని వాదిస్తున్నారు. ఎల్జేపీ జాతీయ ఉపాధ్యక్షుడు సుర్జాభాన్ సింగ్ సైతం ఎన్డీఏతో కలిసే పోటీ చేయాలంటున్నారు.
కొలిక్కరాని సీట్ల పంపకం
ఇలా.. ఎల్జేపీ ఎటూ తేల్చకపోవటం వల్ల బిహార్లో ఎన్డీఏ సీట్ల పంపకం కొలిక్కిరావడం లేదు. అంతకుముందు లెక్కల ప్రకారం.. పొత్తులో భాగంగా భాజపాకు 122సీట్లు రావాల్సి ఉంది. ఇందులో ఎల్జేపీతో పంపకాలు చేపట్టాలి. అదే సమయంలో జేడీయూ తన 121సీట్లలో కొన్ని హెచ్ఏఎంకు వదులుకోవాలి. అయితే, ఎల్జేపీ 42స్థానాల్లో పోటీ చేయాలని భావిస్తుండటం కూటమిలో తలనొప్పులు సృష్టిస్తోంది. అలాగే, శాసన మండలిలో గవర్నర్ కోటాలో భాగంగా ఉన్న 12 సీట్లలో, 2 కేటాయించాలని పట్టుబడుతుండటం వివాదానికి కారణమైంది. ఈ పరిస్థితులు భాజపా ఎల్జేపీకి పొత్తు ప్రకారం సీట్లు కేటాయించేందుకు సుముఖత వ్యక్తం చేసింది. కానీ చిరాగ్ పాసవాన్ ఇందుకు అంగీకరించట్లేదు.
ఇదీ చూడండి: బిహార్లో సీట్ల కేటాయింపుపై కొలిక్కిరాని స్పష్టత!
ఎల్జేపీ నేతల కీలక సమావేశం
ప్రస్తుతం నెలకొన్ని ప్రతిష్టంభన నేపథ్యంలోనే.. ఎల్జేపీ పార్లమెంటరీ బోర్డు మీటింగ్ నిర్వహిస్తోంది. దిల్లీలో శనివారం సాయంత్రం 5గంటలకు పార్టీ కీలక నేతలంతా సమావేశం అవ్వనున్నారు. బిహార్ శాసనసభ ఎన్నికలకు ముందు ఇదే చివరి సమావేశం కానుంది. 143 స్థానాల్లో పోటీ చేయాలని భావిస్తోన్న పార్టీ.. అందుకు సంబంధించిన తుది నిర్ణయం తీసుకోనుంది.
అమిత్ షా హామీ ?
ఈ నేపథ్యంలోనే భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డాతో.. చిరాగ్ పాసవాన్ భేటీ అయ్యారు. ఎల్జేపీని 27 అసెంబ్లీ స్థానాల్లో పోటీకి భాజపా ఆహ్వానించింది. ఇందులో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఎల్జేపీ అధ్యక్షుడు చిరాగ్ పాసవాన్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా చిరాగ్ బిహార్ సీఎం, జేడీయూ అధ్యక్షుడు నితీశ్కుమార్తో తనకు ఉన్న సమస్యను వారి ముందు ఉంచినట్టు తెలుస్తోంది.
అయితే, తాజా భేటీలో ఎన్డీయే పక్షాల మధ్య సీట్ల కేటాయింపు అంశంలో ఎలాంటి తుది నిర్ణయానికీ రాలేదు. ఈ నేపథ్యంలో శని, లేదా ఆదివారాల్లో అభ్యర్థుల జాబితాను భాజపా కేంద్ర ఎన్నికల కమిటీ సిద్ధం చేసే అవకాశం ఉన్నట్టు ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఎన్డీయే మిత్రపక్షాలు కూడా ఒకట్రెండు రోజుల్లో సీట్ల కేటాయింపు అంశం తేలిపోతుందన్న విశ్వాసంతో ఉన్నాయి. అంతిమంగా భాజపా.. ఎల్జేపీకి 33 శాసనసభ, 2 శాసన మండలి సీట్లు ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.
ఇదీ చూడండి: 'మహాఘట్బంధన్'లో ఎవరికెన్ని స్థానాలు- శనివారమే ప్రకటన!
ఇదీ చూడండి: బిహార్లో ఊసరవెల్లి రాజకీయాల ఉరవడి
ఇదీ చూడండి: బిహార్ బరి: నేరచరితుల భార్యలదే హవా!