భారత వైమానిక దళాన్ని మరింత బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం అడుగులేస్తోంది. అమెరికా నుంచి కొనుగోలు చేసిన 4 'సీహెచ్-47 చినూక్' హెలికాప్టర్ల రాకతో ఐఏఎఫ్ మరింత పటిష్ఠమైంది. బోయింగ్ సంస్థ రూపొందించిన ఈ హెలికాప్టర్లను చండీగఢ్‌లోని వైమానిక స్థావరంలో ఉంచారు అధికారులు.
2015లో మోదీ ప్రభుత్వం 1.5 బిలియన్ డాలర్లతో 15 చినూక్ హెలికాప్టర్ల కోసం ఒప్పందం కుదుర్చుకుంది. అందులో భాగంగా బోయింగ్ సంస్థ గతనెల 10న నాలుగు హెలికాప్టర్లను భారత వైమానిక దళానికి అందించింది.
'చినూక్' ఎందుకంత ప్రత్యేకం?
సీహెచ్-47 చినూక్ హెలికాప్టర్లు బహుళ ప్రయోజనాలకు అనుగుణంగా ఆధునిక సాంకేతికతతో తయారుచేసినవి. ఇవి యుద్ధంలో సైన్యానికి ఉపయోగపడతాయి. యుద్ధ సామగ్రిని తరలించేందుకూ వినియోగించొచ్చు. ఎత్తైన కొండ ప్రాంతాల్లో బరువైన మిలటరీ సామగ్రిని మోసుకెళ్లటంలో చినూగ్ ప్రముఖపాత్ర పోషిస్తుందని అధికారులు భావిస్తున్నారు.
ఈ హెలికాప్టర్ ప్రపంచంలోని అనేక భౌగోళిక ప్రాంతాల్లో గొప్ప సామర్థ్యంతో పనిచేస్తుంది. ముఖ్యంగా ఉపఖండంలోని భూభాగంలో భారత వైమానిక దళానికి 'చినూక్' మరింత ప్రయోజనకరంగా ఉంటుంది.