సరిహద్దులో చైనా దుశ్చర్యలకు అడ్డుకట్ట వేసేందుకు భారత్ అన్ని విధాలుగా సన్నద్ధమవుతోంది. చైనాకు ఎక్కడా అవకాశమివ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో.. అరుణాచల్ ప్రదేశ్లో సరిహద్దు వెంబడి ఉన్న లోతైన ప్రాంతాల్లో పీఎల్ఏ కదలికలను పసిగట్టిన భారత సైన్యం.. అక్కడ కూడా భారీ స్థాయిలో బలగాలను మోహరిస్తున్నట్టు సమాచారం.
"పాంగాంగ్ సరస్సు దక్షిణ ప్రాంతంలో చైనాకు ఎదురుదెబ్బ తగిలింది. మరో ప్రయత్నానికి చైనా ఉపక్రమించే అవకాశముంది. ఈ నేపథ్యంలో లద్దాఖ్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు కఠిన నిఘా వ్యవస్థను ఏర్పాటు చేశాం. ముఖ్యంగా అరుణాచల్ ప్రదేశ్లో.. అసిఫిల, టుటింగ్ యాక్సిస్, ఫిష్ టైల్-2 ప్రదేశాలకు ఎదురుగా ఉన్న ప్రాంతాల్లో చైనా సైనికుల కదలికలపై భారత్ ఓ కన్నేసి ఉంచింది."
--- సైనిక వర్గాలు.
ఇదీ చూడండి- సరిహద్దులో భారత్ దేనికైనా రె'ఢీ': రాజ్నాథ్
తమవైపు ఉన్న లోతైన ప్రాంతాల్లో(వాస్తవాధీన రేఖకు 20కి.మీల దూరం) గత కొన్ని రోజులుగా చైనీయుల కదలికలను భారత సైన్యం గమనిస్తున్నట్టు తెలుస్తోంది. గస్తీ కాసే చైనీయులు భారత భూభాగానికి అతి సమీపంగా వస్తున్నట్టు సమాచారం.
చైనా కవ్వింపు చర్యలకు దీటుగా జవాబు చెప్పేందుకు భారత సైన్యం సిద్ధంగా ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
మారని చైనా...
వాస్తవాధీన రేఖ వెంబడి దుస్సాహసాలకు పాల్పడేందుకు ఈ ఏడాది మే నుంచి చైనా ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలోనే సరిహద్దు ఉద్రిక్తతలు తలెత్తాయి. పరిస్థితిని శాంతింపజేయడానికి ఇరువైపులా చర్చలు జరుగుతున్నాయి. కానీ చైనా ద్వంద్వ వైఖరి వల్ల సమస్యకు పరిష్కారం లభించడం లేదు.
ఇదీ చూడండి:- సరిహద్దు వెంబడి చైనా మరో కుట్ర