కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరానికి ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు దిల్లీ హైకోర్టు నిరాకరించిన నేపథ్యంలో ఆయన ముందు ఉన్న ఒకే ఒక్క మార్గం సుప్రీం కోర్టు. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో చిదంబరం నిందితుడిగా ఉన్నారు.
ఈ కేసులో చిదంబరానికి అరెస్టు నుంచి మధ్యంతర రక్షణ కల్పించే పిటిషన్‌పై అత్యవసరంగా విచారణ చేపట్టాలంటూ సుప్రీంకోర్టుకు వెళ్లారు సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, అభిషేక్ మను సింఘ్వీ. ప్రధాన న్యాయమూర్తి అందుబాటులో లేకపోవడం వల్ల రిజిస్ట్రార్‌ను కలిశారు.
నేడు ఉదయం 10:30 గంటలకు ఈ పిటిషన్‌పై సుప్రీం కోర్టు విచారణ చేపట్టే అవకాశం ఉంది.
సీబీఐ..
దిల్లీ హైకోర్టు ముందస్తు బెయిల్ పిటిషన్ తిరస్కరించడం వల్ల చిదంబరం నివాసానికి సీబీఐ అధికారులు వెళ్లారు. ఈ నేపథ్యంలో చిదంబరాన్ని అరెస్టు చేస్తారన్న ప్రచారం సాగింది. అయితే, అధికారులు వెళ్లిన సమయంలో ఆయన ఇంట్లో లేకపోవడం వల్ల వారు వెనుదిరిగినట్టు సమాచారం.
ఖండించిన కాంగ్రెస్...
చిదంబరం విషయంలో ప్రభుత్వం, దర్యాప్తు సంస్థలు అనుసరిస్తోన్న విధానాలపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంతరం తెలిపింది. దిల్లీ హైకోర్టు కేవలం ముందస్తు బెయిల్ పిటిషన్‌ను మాత్రమే తిరస్కరించిందని అరెస్ట్ చేయాలని చెప్పలేదని పార్టీ సీనియర్ నేత ఆనంద్ శర్మ పేర్కొన్నారు. దర్యాప్తు సంస్థల సాయంతో విపక్ష నేతలపై రాజకీయ కక్ష సాధింపులకు ప్రభుత్వం పాల్పడుతుందని ఆరోపించారు. చిదంబరం వ్యవహారంపై సుప్రీం కోర్టు రేపు విచారణ చేపట్టేవరకు అరెస్ట్ చేయకుండా ఉండాలని కోరారు.
- ఇదీ చూడండి: ప్రధాని పిలుపుతో పార్లమెంటులో ప్లాస్టిక్ నిషేధం