కంటైన్మెంట్ ప్రాంతాల్లోని ప్రజల విచిత్ర కోర్కెలు, విన్నపాలతో దిల్లీ పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. దేశ రాజధానిలో కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు అక్కడి ప్రభుత్వం 76 కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేసింది. క్వారెంటైన్లో, కంటైన్మెంట్ జోన్లలో ఉన్న ప్రజలను బయటకు అనుమతించడం లేదు. ఇళ్లవద్దకే నిత్యావసరాల సరఫరా చేపట్టేలా వాటి పరిధుల్లో అధికారులను నియమించింది. ఇదే క్రమంలో స్థానికుల నుంచి విచిత్ర డిమాండ్లు వస్తున్నాయని పేర్కొంటున్నారు అధికారులు.
సామాజిక మాధ్యమాల్లో అభ్యర్థనలు
కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించిన ప్రాంతాల్లోని ప్రజలకు అధికారులు ఓ వాట్సాప్ గ్రూప్‌ను క్రియేట్ చేస్తున్నారు. దీని ద్వారా అక్కడి ప్రజలు అభ్యర్థనలు చేయగా వారు కోరుకునే వస్తువులను ఇంటి వద్దకు పంపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కొందరు చికెన్ బర్యానీ అడిగితే మరి కొంతమంది సమోసాలు డిమాండ్ చేస్తున్నారట.
ఆయా కంటైన్మెంట్ ప్రాంతాల్లోని ప్రజలు చికెన్ బిర్యానీ, మటన్, పిజ్జా, వేడి వేడి సమోసాలు వంటి ఆహారాన్ని అందించమని కోరుతున్నారని ఓ అధికారి తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో స్వీట్లు కూడా పంచాలని అడుగుతున్నారట.
"మేము ఇలాంటి డిమాండ్లను నెరవేర్చం. సంక్షోభం వల్ల ఒక ప్రాంతం మూసివేసి, కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించిన సమయంలో అక్కడి ప్రజలకు కూరగాయలు, నీరు, పాలు వంటి అత్యవసరమైన వస్తువులను అందించడం మా కర్తవ్యం. కానీ ఇందుకు భిన్నంగా చికెన్, మటన్, పిజ్జాలు కోరుతున్నారు. ఇలాంటి డిమాండ్లు వదిలేయాలని సూచిస్తున్నాం."
-- ఓ సీనియర్ అధికారి
దిల్లీలో కరోనా వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్న 76 ప్రాంతాలను గుర్తించి వీటిని కంటైన్మెంట్ జోన్లుగా గుర్తించారు. దేశరాజధానిలో ఇప్పటివరకు 1,893 కరోనా కేసులు నమోదు కాగా.. 43 మంది మృతి చెందారు. వీరిలో 24 మంది 60 ఏళ్ల పైబడినవారే.
ఇదీ చదవండి: ఆ ఆసుపత్రిలో 21 మంది వైద్య సిబ్బందికి కరోనా