చెన్నైలో భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలకు నగరంలోని పలు ప్రాంతాల్లో నీరు నిలిచిపోయింది. 97.27 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. 2014 అక్టోబర్ తర్వాత ఇంతటి స్థాయిలో వర్షం కురవడం ఇదే తొలిసారి. వ్యాసర్పాడి, ఎగ్మోర్, పలవక్కం, కిల్పాక్, ఎంఎండీఏ కాలనీ, తిరువన్మియుర్ ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి.
నుంగంబక్కంలో 13 సెంటీ మీటర్లు, అన్నా యూనివర్సిటీ వద్ద 13.4 సెంమీ, ఎన్నోర్లో 8 సెం.మీ, రెడ్ హిల్స్ వద్ద 13 సెం.మీల వర్షపాతం నమోదైంది.
భారీ వర్షాలకు ఛాన్స్
మరికొన్ని రోజుల వరకు చెన్నై సహా చుట్టుపక్కల ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ శాఖ డిప్యూటీ డైరెక్టర్ డా. ఎస్ బాలచంద్రన్ తెలిపారు. కాంచీపురం, తిరువళ్లూరు, విల్లుపురం, విరుదునగర్, తిరునెల్వెలి జిల్లాలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వెల్లడించారు.