చంద్రుడి ఉపరితలంపై చంద్రయాన్-2 వ్యోమనౌక దిగే క్షణాల కోసం యావత్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. తమిళనాడులోని ఆ రెండు గ్రామాల్లో ఆ ఆత్రుత ఇంకా ఎక్కువగా ఉంది. చంద్రయాన్-2తో ఆ ఊళ్లకు ఉన్న అనుబంధం ఎలాంటిదంటే వ్యోమనౌకలోని ల్యాండర్, రోవర్‌కు అవి నడకనేర్పాయి.
చంద్రుని ఉపరితలానికి భూగ్రహంపై ఉండే నేలకు చాలా వ్యత్యాసం ఉంటుంది. చంద్రయాన్-2 వ్యోమనౌకలోని ల్యాండర్ కాళ్లు చంద్రుడి ఉపరితలంపై సాఫీగా దిగేలా రోవర్‌లోని చక్రాలు ముందుకు సాగేలా చూడాలి. అందుకోసం విస్తృతంగా పరీక్షలు జరపటానికి జాబిల్లి ఉపరితలాన్ని కృత్రిమంగా సృష్టించాల్సి వచ్చింది.
అమెరికా డిమాండ్‌తో ప్రత్యామ్నాయాలు
అందుకు అవసరమైన మట్టి ఇస్రో వద్ద లేదు. అమెరికా వద్ద ఉన్నప్పటికీ పెద్ద మొత్తం డబ్బును డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయాలపై ఇస్రో దృష్టి సారించింది. చంద్రుడి ఉపరితలాన్ని పోలిన మట్టికోసం భూగర్భ శాస్త్రవేత్తల సాయం తీసుకుంది. చంద్రుడిపై బసాల్టిక్, ఆంత్రోసైట్ శిలలు ఉంటాయి.
ఆ రెండు గ్రామాల్లో..
తమిళనాడులోని సేలంకు 65 కిలోమీటర్ల దూరంలోని సీతంపూండి, కున్నామలై గ్రామాల్లో ఆంత్రోసైట్ శిలలు ఉన్నట్లు గుర్తించారు. అలాంటి శిలలను మహారాష్ట్రలోనూ కనుగొన్నారు. ఆ గ్రామాల నుంచి సేకరించిన శిలలను చంద్రునిపై ఉండే మట్టి పరిమాణంలో పిండి చేశారు. శిలారేణువుల పరిమాణం 30 నుంచి 200 మైక్రాన్లు ఉండేలా పిండి చేశారు.
బెంగళూరులో..
ఆ మిశ్రమాన్ని బెంగళూరులోని 'లూనార్ టెరైన్ టెస్ట్ ఫెసిలిటీ'కి తీసుకెళ్లి కృత్రిమంగా చందమామ ఉపరితలాన్ని సృష్టించారు. అక్కడ చంద్రయాన్-2లోని ల్యాండర్, రోవర్లను పరీక్షించారు. భూమితో పోలిస్తే చంద్రునిపై గురుత్వాకర్షణ శక్తి ఆరో వంతు మాత్రమే ఉంటుంది. అలాంటి వాతావరణం కోసం రోవర్‌ను హీలియంతో నిండిన బెలూన్‌తో కొంతమేర పైకి లేపారు. ఈ ప్రయోగాలు ఇస్రోకు కలిసి వచ్చాయి.
4 నుంచి 6 చక్రాలు
తొలుత రోవర్‌కు 4 చక్రాలనే అమర్చాలని భావించింది ఇస్రో. ఈ పరీక్షల్లో ఎదురైనా అనుభవాలను దృష్టిలో ఉంచుకొని చక్రాల సంఖ్యను 6కు పెంచింది.
జాబిల్లిపై ఉండే మట్టికోసం ఇస్రో 25 కోట్లు కేటాయించింది. వాస్తవంగా అయిన ఖర్చు చాలా తక్కువ. ఎందుకంటే ఆ మట్టిని తయారు చేసేందుకు సహకరించిన అనేక సంస్థలు పైసా తీసుకోలేదు. ఈ విధంగా చంద్రయాన్-2 ప్రయోగానికి ఉపయోగించిన వ్యోమనౌకలోని ల్యాండర్, రోవర్‌కు తమిళనాడులోని సీతంపూండి, కున్నామలై గ్రామాలు నకడనేర్పాయి.