నిప్పులు కక్కుతూ.. మేఘాలు చీల్చుకుంటూ నింగికెగిరిన చంద్రయాన్-2 విజయంపై ప్రధాని నరేంద్ర మోదీ తన ఆనందాన్ని ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. ప్రతి భారతీయుడు ఛాతీ గర్వంతో ఉప్పొంగిందన్నారు. భారత శాస్త్రవేత్తల పనితనం విశ్వవ్యాప్తమైందంటూ హర్షం వ్యక్తం చేశారు.
చంద్రయాన్-2 ప్రయోగాన్ని ఆద్యంతం టీవీలో వీక్షించారు మోదీ. వాహక నౌక నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశించగానే చప్పట్లతో సంతోషం వ్యక్తం చేశారు. చంద్రయాన్- 2తో లభించిన స్ఫూర్తి భారత శాస్త్రరంగంలో పురోభివృద్ధితో పాటు.. యువతరాన్ని నాణ్యమైన అవిష్కరణలు చేసే విధంగా ప్రోత్సహిస్తుందని అభిప్రాయపడ్డారు.
"చంద్రయాన్-2 ప్రాజెక్ట్‌కు కృతజ్ఞతలు... భారత్ చేపట్టిన ఈ జాబిల్లి యాత్ర.. మరింత ఉత్సాహాన్నిస్తుంది. మన విజ్ఞానం మరింత వికసించనుంది. చంద్రయాన్-2 ప్రత్యేకం. ఇప్పటివరకు ఎవరూ పరిశోధించని జాబిల్లి దక్షిణ ధ్రువంపై చంద్రయాన్-2 దృష్టి సారించనుంది. మన దేశ చరిత్రలో ఇది మరో కలికితురాయి కానుంది." - నరేంద్ర మోదీ, ప్రధాని
మార్మోగిన రాజ్యసభ...
చంద్రయాన్-2 విజయాన్ని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు రాజ్యసభలో ప్రస్తావించారు. సభ్యులందరూ బల్లలు చరిచి తమ సంతోషాన్ని ప్రకటించారు. భారత దేశ ఖ్యాతి విశ్వవ్యాప్తమైందని హర్షం వ్యక్తం చేశారు.