చంబల్ బందిపోటు ముఠా.. సుమారు 75 హత్యలు చేసింది. లెక్కలేనంత మందిని అపహరించింది. ఆ ముఠా నాయకుడు మధ్యప్రదేశ్ ష్యోపుర్కు చెందిన రమేశ్ సింగ్ శికర్వార్. ప్రస్తుతం లోహరానీలో సాధారణ రైతు జీవితం గడుపుతున్నాడు.
రమేశ్‌తో 10 నిమిషాలు మాట్లాడితే ఇతను బందిపోటేంటీ? అనేది మనకు మొదట ఎదురయ్యే ప్రశ్న. అంత మృదువుగా మాట్లాడుతాడీ 70 ఏళ్ల మాజీ బందిపోటు. ఇతనెలా 75 హత్యల్లో పాలుపంచుకున్నాడు అనిపిస్తుంది.
బంధువుల హత్యతోనే మొదలు
1970లో రమేశ్ 7వ తరగతి చదువుతున్నాడు. ఓ భూవివాదంలో రమేశ్‌పై దొంగతనం కేసు పెట్టి అరెస్టు చేయించారు అతని బంధువులు. ఇదే అతను ఆయుధం పట్టడానికి కారణమయిందని రమేశ్ చెబుతున్నాడు.
"నేను పోలీసులకు రూ.400 లంచం ఇచ్చి విడుదలయ్యాను. ష్యోపుర్లోని దువేరాకి వెళ్లి మా బంధువులపై ప్రతీకారం తీర్చుకున్నా. ఒక ముఠాను కూడగట్టి మొదటి హత్య చేశాను."
-రమేశ్ సింగ్ శికర్వార్
అనంతర కాలంలో అలా హత్యలు చేస్తూనే వెళ్లిందీ ముఠా. కానీ 1984లో పోలీసులకు లొంగిపోయి రమేశ్, ఇంకా అతని అనుచరులు... 12 ఏళ్లపాటు జైలులో ఉన్నారు. పునరావాసం కింద ప్రభుత్వం ఇచ్చిన భూమిలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు రమేశ్.
ఈ మార్పు ఎలా?
ఏళ్లపాటు ఎన్నో నేరాలు చేసిన ముఠా సభ్యులు ఆ జీవితంపై విసుగుచెందారు. సాధారణ జీవితాన్ని పొందేందుకు ప్రభుత్వాన్ని ఆశ్రయించారు. ఇందుకు కొన్ని హామీలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ముఠా డిమాండ్లను అప్పటి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి అర్జున్ సింగ్ అంగీకరించారు. వారికి 30 ఎకరాల భూమి, వారి పిల్లలకు ఉద్యోగాలు, లైసెన్స్ తుపాకులు ఇచ్చేందుకు ముందుకువచ్చారు. వారిలో మార్పు రావాలని ఆయన కోరుకున్నారు.
గ్రామస్థుల సేవలో..
ప్రస్తుతం లోహరానీలోని తన వ్యవసాయ భూమిలో రెండు గుడిసెలు వేసుకుని అక్కడే జీవిస్తున్నాడు రమేశ్. ఆత్మరక్షణ కోసం లైసెన్సు తుపాకీని వెంటపెట్టుకున్నాడు. గ్రామస్థులకు చేదోడువాదోడుగా ఉంటూ వారి సమస్యలను తీరుస్తున్నాడు.
ఇదీ చూడండి: గోడకు కన్నం వేసి.. లలితా జ్యువెలరీలో భారీ చోరీ!