'చౌకీదార్ చోర్ హై'... భాజపాను ఓడించేందుకు మోదీపై కాంగ్రెస్ ప్రయోగించిన నినాదం. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈ పదాన్ని విస్తృతంగా వాడారు. ప్రతి బహిరంగ సభలోనూ చౌకీదార్ నామం జపిస్తూ ప్రజల్లోకీ తీసుకెళ్లారు. ఫలితం తారుమారు... ప్రయోజనం భాజపాకు. కారణం... కాంగ్రెస్ ప్రచారాన్ని తిప్పికొట్టడంలో మోదీ సఫలంకావడం. చివరకు... 'చౌకీదార్ నరేంద్ర మోదీ' రెండో సారి ప్రధానమంత్రిగా అవతరించారు. కాంగ్రెస్‌కు మరోసారి నిరాశనే మిగిల్చారు.
అప్పట్లో చాయ్‌వాలా...
2014 సార్వత్రికానికి ముందూ ప్రజల్లోకి వెళ్లేందుకు మోదీకి ఉపకరించిన నినాదం చాయ్‌వాలా. టీ అమ్మిన నేపథ్యంపై కొందరు కాంగ్రెస్ నేతలు అవహేళన చేయడాన్ని ప్రచారాంశంగా మలుచుకున్నారు మోదీ. మీలో ఒకరినంటూ... సామాన్య ప్రజానీకానికి చేరువయ్యారు. ఎన్నికల్లో తిరుగులేని ఏకపక్ష విజయం సాధించారు.
ఐదేళ్లు తిరిగాయి. మళ్లీ సాధారణ ఎన్నికలొచ్చాయి. ఇప్పుడు చాయ్‌వాలా ఊసే లేదు. చర్చంతా చౌకీదార్ గురించే. దేశ ఖజానాకు కాపలాదారుడిగా చేస్తానన్నది మోదీ మాట. రఫేల్ వ్యవహారాన్ని ప్రస్తావిస్తూ.... 'చౌకీదార్ చోర్ హై' అన్నది కాంగ్రెస్ విమర్శ.
చాయ్‌వాలా ఫలితమే పునరావృతమైంది. బలహీనతగా మారుద్దామనుకున్న అంశం.. మోదీకి బలాన్ని చేకూరుస్తుందని అనుకోలేదేమో కాంగ్రెస్.
ఎక్కడ చూసినా చౌకీదార్లే...
2014లో 'చాయ్‌వాలా'గా ప్రజలతో పరిచయం పెంచుకొన్న మోదీ.. ఈ సార్వత్రికానికి ముందు 'చౌకీదార్' పేరుతో ఆ స్నేహబంధం కొనసాగించారు. ప్రతి బహిరంగ సభలోనూ, ఏ వేదికపై అయినా 'ఈ కాపలాదారుకు అవకాశం ఇవ్వండి.. ఎలాంటి కష్టం రాకుండా చూసుకుంటా' అంటూ ప్రజల్లో విశ్వాసం పొందారు. దేశానికి తానే సంరక్షకుడిని అనే భరోసా కలిగించుకున్నారు.
" మీరు నిశ్చింతగా ఉండండి... మీ చౌకీదార్ అన్ని విధాల అప్రమత్తంగా ఉన్నాడు.''
-- నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి
ట్విట్టర్లో...
చౌకీదార్ పదం ఎంతలా విస్తరించిందంటే.. ట్విట్టర్లో మార్మోగిపోయేంతలా. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆయన ట్విట్టర్ ఖాతా పేరుకు ముందు చౌకీదార్ పేరును జోడించారు. కేంద్ర మంత్రులు, భాజపా పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, నేతలు, కార్యకర్తలూ అధినేత బాటలోనే పయనించారు. అక్కడితో ఆగలేదు. చౌకీదార్ పదంపై మీమ్స్.. సామాజిక మాధ్యమాల్లో షికారు చేశాయి.
ఫలించని కాంగ్రెస్ వ్యూహం...
మోదీ పేరుకు ముందు చౌకీదార్ చేర్చుకుంటే... కాంగ్రెస్ నేత హార్దిక్ పటేల్ 'బేరోజ్‌గార్' పదాన్ని తీసుకొచ్చారు. నిరుద్యోగం సమస్యను మోదీ పరిష్కరించలేదని విమర్శించడం హార్దిక్ ఉద్దేశం.
మోదీ ధనవంతులు, బడా వ్యాపారులకే చౌకీదార్ అంటూ రాహుల్ ఆరోపించారు. పేదలకు చౌకీదార్ అవసరం లేదన్నారు ప్రియాంక. ఈ వ్యూహాలు హస్తం పార్టీకి పెద్దగా ప్రయోజనం చేకూర్చలేకపోయాయి.
ఇదీ చూడండి: