కరోనా సంక్షోభంతో వ్యాపార రంగం డీలా పడింది. చిన్న, మధ్య తరహా వ్యాపారాలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో చిన్న వ్యాపారుల సమస్యలను గుర్తించి, పరిష్కరించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని డిమాండ్ చేశారు బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) అధినేత్రి మాయావతి.
" కోట్ల మందికి ఉపాధి కల్పిస్తోన్న చిన్న, మధ్య తరహా వ్యాపార రంగాలు లాక్డౌన్ కారణంగా మూతపడుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వాటి సమస్యలకు కారణాలను విశ్లేషించి, పరిష్కరించాలి. కేంద్ర ప్రభుత్వం కొత్త వ్యాపారాలకు చేయూతనిస్తామని చేసిన ప్రకటనను తాము వ్యతిరేకించం. ఇప్పటికే కొనసాగుతున్న వ్యాపారాలకు కూడా ప్రభుత్వం సాయమందించాలి."
- మాయావతి, బీఎస్పీ అధినేత్రి
వలస కూలీలపై ప్రభావం..
పేద, అట్టడుగు వర్గాల వారితో సహా వలస కార్మికులపై కరోనా తీవ్ర ప్రభావం చూపిందని మాయావతి పేర్కొన్నారు. కొన్ని రాష్ట్రాలు వలస కూలీలను వెనక్కి రప్పిస్తున్నాయని.. అయితే వారికి ఆయా ప్రభుత్వాలు మౌలిక వసతులు కల్పించడంలో విఫలమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆత్మనిర్భర్ అభియాన్‌పై ప్రశంసలు..
ఏడాది కాలానికి పరిమితమయ్యే విధంగా కొత్త పథకాలను ప్రవేశపెట్టకూడదన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని మాయావతి స్వాగతించారు. వీటికి బదులుగా ఆ సొమ్మును 'గరీబ్ కల్యాణ్ యోజన', 'ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్'పై ఖర్చు చేయడం మంచి నిర్ణయమని చెప్పారు.
ఇదీ చదవండి: కేంద్రం చర్య డీమానిటైజేషన్ 2.0. సంకేతమేనా: రాహుల్