దేశవ్యాప్తంగా కరోనా కేసులకు 10 ప్రాంతాలు హాట్‌స్పాట్‌లుగా ఉన్నాయని కేంద్రం ప్రకటించింది. ఎక్కువ కేసులు ఆరు రాష్ట్రాల్లో ఉన్నాయని లెక్క తేల్చింది. దిల్లీలోని పశ్చిమ నిజాముద్దీన్... తబ్లీగీ కార్యకలాపాలతో దేశంలోనే కరోనాకు కీలక హాట్ స్పాట్‌గా మారింది. రాజస్థాన్‌లో భిల్వారా ప్రాంతం హాట్ స్పాట్ కాగా...రాష్ట్రంలో నమోదైన 83 కేసుల్లో ఈ ఒక్క ప్రాంతం నుంచే 26 వచ్చాయి. దిల్లీని ఆనుకుని ఉన్న పశ్చిమ యూపీలోని గౌతమబుద్ధ నగర్‌లో 48 కేసులున్నాయి. ఇన్ని కేసులు మరే జిల్లాలోనూ లేవు. నోయిడాలో 2,046 మందిని వైద్య పరిశీలనలో ఉంచారు. యూపీలోని మేరఠ్ కేసుల పరంగా రెండో స్థానంలో ఉంది. 19 మందికి పాజిటివ్ వచ్చింది. బుధవారం 72 ఏళ్ల వృద్ధుడు కరోనాతో మృతి చెందాడు. ముంబయి ప్రయోగశాలలకు పంపిన నమునాల్లో ఎక్కువ మందిలో కరోనా కనిపిస్తుండటంతో కొలివాడ, గోరేగావ్ ప్రాంతాలను హాట్ స్పాట్‌లుగా ప్రకటించారు.
![centre identified 10 hotspots of coronavirus in india](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/6627417_thumbnail.png)
పుణెలో ఇప్పటివరకు దాదాపు 50మంది కరోనా బారిన పడగా.. 2,216మంది వైద్యపరిశీలనలో ఉన్నారు. వీటితో పాటు అహ్మదాబాద్, కేరళలోని కాసరగోడ్, పథనంథిట్టలను హాట్‌స్పాట్‌లుగా కేంద్ర ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా 70 దేశాలనుంచి వచ్చిన 2 వేల మంది తబ్లీగీ జమాత్ కార్యకర్తలను గుర్తించి.. క్షుణ్నంగా స్క్రీన్ చేసి క్వారంటైన్ కేంద్రాలకు కానీ, ఆసుపత్రికి కాని తరలించాలని కేంద్ర హోంశాఖ రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది.
హాట్‌స్పాట్‌లు అంటే?
సాధారణంగా ఒక ప్రాంతంలో 10కి పైగా కరోనా కేసులు నమోదైతే ఆ ప్రాంతాన్ని ఒక క్లస్టర్‌గా గుర్తిస్తారు. ఒకే ప్రాంతంలో ఇలాంటి క్లస్టర్లు ఎక్కువగా ఉంటే వాటిని హాట్‌స్పాట్‌లు అంటారు. ఇలాంటి హాట్‌స్పాట్స్ దేశంలో 10 వరకు ఉన్నాయి. దిల్లీలోని దిల్షాన్ గార్డెన్, నిజాముద్దీన్.. యూపీలోని నోయిడా, మేరఠ్.. రాజస్థాన్‌లోని బిల్వారా… గుజరాత్‌లోని అహ్మదాబాద్.. మహారాష్ట్రలోని ముంబై, పుణె.. కేరళలోని కాసర్ గోడ్, పతనంతిట్ట ప్రాంతాలు కరోనా వ్యాప్తికి హాట్‌స్పాట్‌లుగా మారాయి. దక్షిణాదిన కేరళలో మాత్రమే హాట్‌స్పాట్‌ను గుర్తించారు. మిగతావన్నీ ఉత్తరాది రాష్ట్రాల్లోనే ఉన్నాయి. విదేశాలనుంచి వచ్చిన వారిలో ఎక్కువగా క్వారంటైన్ నిబంధనలను ఉల్లంఘించి ఈ ప్రాంతంలోనే తిరిగినట్టు అధికారులు చెబుతున్నారు. ఈ 10 ప్రాంతాల్లోనే 24 గంటల వ్యవధిలో 227 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇందులో ఐదుగురు మరణించారు. ప్రతి 100 కేసుల్లో ఒకరు మరణిస్తే ఆ ప్రాంతాన్ని కచ్చితంగా హాట్‌స్పాట్‌గా గుర్తిస్తారు. ఈ 10 ప్రాంతాల్లో కరోనా పరీక్షలను వేగవంతం చేయడంతో పాటు లాక్‌డౌన్ నిబంధలను కఠినంగా అమలుచేయడానికి సిద్ధమవుతున్నారు.
సంబంధీకులనూ గుర్తించండి
తబ్లీగీ జమాత్ కార్యకర్తలతో అనుసంధానమైన వారిని కూడా వెంటనే గుర్తించాలని కేంద్ర కేబినేట్ కార్యదర్శి రాజీవ్ గాబా రాష్ట్రాలను ఆదేశించారు. నిజాముద్దీన్ మర్కజ్‌కు హాజరైన విదేశీయులందరి వీసాలను రద్దు చేయాలని కేంద్ర హోంశాఖ యోచిస్తున్నట్లు సమాచారం. ఇకముందు ఇలా వీసా నిబంధలు ఉల్లంఘించే విదేశీయులపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్రం నిర్ణయించింది. అంతర్జాతీయ విమానయానంపై నిషేధం ఎత్తివేసిన మరుక్షణమే విదేశీ కార్యకర్తలను వెనక్కి పంపే అవకాశం ఉంది.