కొత్త పోస్టుల కల్పనను నిలిపివేస్తూ ఇచ్చిన ఉత్తర్వులపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. ఇది కేవలం అంతర్గత పోస్టుల సృష్టికి సంబంధించిన అంశమని పేర్కొంది. కీలకమైన ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలపై నిషేధం గానీ, ఎలాంటి ప్రభావం గానీ ఉండబోదని స్పష్టం చేసింది. స్టాఫ్ సెలక్షన్ కమిషన్, యూపీఎస్సీ, రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు సంస్థలు యథావిధిగా తమ పరిధిలో నియామకాలు చేపట్టొచ్చని ఆర్థిక మంత్రిత్వశాఖ స్పష్టతనిస్తూ ట్వీట్ చేసింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఈ అంశాన్ని లేవనెత్తిన నేపథ్యంలో ఈ వివరణ రావడం గమనార్హం.
కరోనా మహమ్మారి కారణంగా ఆదాయం తగ్గిపోయి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కేంద్ర ప్రభుత్వం కొత్త పోస్టుల కల్పనను నిలిపివేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. కేంద్ర ఆర్థికశాఖ వ్యయవిభాగం ఆమోదం పొందిన పోస్టులు తప్ప మిగతావాటిపై నిషేధం కొనసాగుతుందని తెలిపింది. కేంద్ర ఆర్థికశాఖ వ్యయవిభాగం అనుమతి లేకుండా, అధికారులు తమ అధికారాలను అనుసరించి ఈ ఏడాది జులై 1 తరువాత ఏవైనా పోస్టులు సృష్టించి ఉంటే వాటిని భర్తీచేయకూడదని ఆదేశించింది.
ఒకవేళ వాటిని భర్తీచేయడం అత్యవసరమని భావిస్తే అందుకు సంబంధించిన ప్రతిపాదనలను వ్యయ విభాగానికి పంపాలని షరతు విధించింది. అభివృద్ధియేతర కార్యక్రమాల వ్యయాన్ని తగ్గించి ప్రాధాన్యతా కార్యక్రమాలకు తగిన నిధులు అందుబాటులో ఉంచడానికి ఈ చర్య తీసుకుంటున్నట్లు పేర్కొంది. ఈ ఉత్తర్వులపై గందరగోళం నెలకొనడంతో తాజాగా ఆర్థిక శాఖ వివరణ ఇచ్చింది.