సార్వత్రిక సమరం ముగిసినా... బంగాల్‌లో హింసాత్మక సంఘటనలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. వీటిపై భాజపా, తృణమూల్ పార్టీలు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాయి. రాజకీయ దురుద్దేశంతోనే రాష్ట్రంలో భాజపా హింసను పురిగొల్పుతోందని బంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు.
"రాష్ట్రంలో భాజపా కావాలనే హింసను ప్రేరేపిస్తోంది. కోట్ల డబ్బు వెచ్చించి నకిలీ వార్తలను ప్రచారం చేస్తున్నారు. ఏదైనా రాష్ట్రంలో అల్లర్లు జరిగితే కేంద్రం తన బాధ్యతను మరువకూడదు. వాళ్లను దీటుగా ఎదుర్కొనేది నేనే. పథకం ప్రకారం నా గొంతు నొక్కేందుకు కేంద్రం, భాజపా ప్రయత్నిస్తోంది. మా ప్రభుత్వాన్ని కూలదోయాలన్న కుయుక్తులు నెరవేరవు."
-మమతా బెనర్జీ, బంగాల్ ముఖ్యమంత్రి
భాజపా నిరసన ర్యాలీలు
బంగాల్‌లో జరుగుతున్న హింసకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా భాజపా నిరసన ర్యాలీలు చేపడుతోంది. తృణమూల్-భాజపా శ్రేణుల మధ్య జరిగిన ఘర్షణల్లో నలుగురు మృతి చెందిన విషయంపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది కమల దళం. రాష్ట్ర చరిత్రలో ఇది చీకటి దినంగా కమల దళం అభివర్ణించింది. ఉత్తర 24 పరగణా జిల్లాలోని బషీర్హాట్లో 12 గంటల బంద్కు పిలుపునిచ్చింది కాషాయ పార్టీ.
ఇదీ జరిగింది
బషీర్హాట్లో తృణమూల్ కాంగ్రెస్-భాజపా శ్రేణుల మధ్య శనివారం జరిగిన ఘర్షణల్లో నలుగురు మృతి చెందారు. ఈ విషయంపై ఆందోళన వ్యక్తం చేసిన కేంద్రం నివేదిక కోరింది. బంగాల్‌లో శాంతి భద్రతలు పూర్తిగా అదుపులోనే ఉన్నాయని మమతా బెనర్జీ ప్రభుత్వం కేంద్రానికి తెలిపింది. ఈ మేరకు రాష్ట్రంలో తాజా పరిస్థితులపై బంగాల్ ప్రభుత్వం లేఖ రాసింది.
సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు నిత్యం పహారా కాస్తున్నట్లు లేఖలో రాష్ట్ర సర్కారు పేర్కొంది. ఘటనలపై ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. హింసాత్మక ఘటనలకు బాధ్యులైన వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోనున్నట్లు బంగాల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మలాయ్ కుమార్‌డే కేంద్రానికి తెలిపారు.
ఇదీ చూడండి: బెంగాల్ హింసాకాండపై కేంద్రం ఆందోళన