కేంద్ర పాలిత ప్రాంతాలుగా అవతరించిన జమ్ముకశ్మీర్, లద్దాఖ్‌లోని ఏదైనా ప్రాంతాన్ని సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టం (ఏఎఫ్ఎస్పీఏ) కింద 'కల్లోలిత ప్రాంతం'గా ప్రకటించే అధికారాన్ని కేంద్రం చేతిలోకి తీసుకుంది. ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసింది కేంద్ర హోంశాఖ.
జమ్ముకశ్మీర్ రాష్ట్ర పునర్విభజన చట్టం అమలులోకి వచ్చే వరకు రాష్ట్ర ప్రభుత్వానికి ఈ అధికారాలు ఉండేవి. ఏఎఫ్ఎస్పీఏ కింద రాష్ట్ర ప్రభుత్వమే ఏదైనా జిల్లా, పోలీస్ స్టేషన్ ప్రాంతాన్ని కల్లోలిత ప్రాంతంగా ప్రకటించేది. అయితే.. ప్రస్తుత నోటిఫికేషన్ ప్రకారం రెండు కేంద్ర పాలిత ప్రాంతాలలో సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం(జమ్ముకశ్మీర్) 1990.. ఇప్పటి నుంచి కేంద్ర హోంశాఖ పరిధిలోని జమ్ముకశ్మీర్, లద్దాఖ్ వ్యవహారాల శాఖ అధీనంలోకి వస్తుంది.
కలహ ప్రాంతంగా ప్రకటిస్తేనే..
సాయుధ దళాల అవసరం ఏర్పడిన ప్రాంతాల్లో ఏఎఫ్ఎస్పీఎఫ్ చట్టాన్ని అమలు చేస్తారు. ఏఎఫ్ఎస్పీఏ అమలులో ఉండాలంటే.. కేంద్రం లేదా రాష్ట్ర ప్రభుత్వం ఆ ప్రాంతాన్ని 'కల్లోలిత ప్రాంతగా' ప్రకటించాలి. అవిభక్త జమ్ముకశ్మీర్‌లో 1990 నుంచి ఈ చట్టం అమలవుతోంది. అయితే.. లేహ్, లద్దాఖ్ ఇంతవరకు అల్లర్ల ప్రాంతంగా ప్రకటించని లద్దాఖ్‌లో కలిశాయి.
లెఫ్టినెంట్ గవర్నర్ల చేతిలోకి...
రాష్ట్ర పునర్విభజనతో.. రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లో పోలీస్, శాంతిభద్రత వ్యవహారాలు కేంద్ర హోంశాఖ పరిధిలోని లెఫ్టినెంట్ గవర్నర్ల చేతిలోకి వచ్చాయి. కేంద్ర హోంశాఖ పరిధిలోని జమ్ముకశ్మీర్ వ్యవహారాల విభాగం పేరును జమ్ముకశ్మీర్, లద్దాఖ్ వ్యవహారాల విభాగంగా మార్చారు.
నోటిఫికేషన్ ప్రకారం రెండు కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించిన విషయాలపై జమ్ముకశ్మీర్, లద్దాఖ్ వ్యవహారాల విభాగం బాధ్యత వహిస్తుంది. ఇందులో ఉగ్రవాద నిర్మూలన, భారత్-పాక్ మధ్య నియంత్రణ రేఖ నిర్వహణ వంటివి ఉన్నాయి.
ఇదీ చూడండి: ఫైర్ అలారం పొరపాటు... ఇండిగో విమానంలో కలకలం