భారత్- పాక్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న వేళ పాక్ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. నియంత్రణ రేఖ వెంబడి కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాకిస్థాన్ మరోమారు ఉల్లఘించింది. జమ్ముకశ్మీర్ మేంఢర్, బాలాకోట్, కృష్ణఘాటి సెక్టార్లలో పాక్ సైన్యం కాల్పులకు తెగబడింది.
జమ్ముకశ్మీర్ ఉరీ సెక్టార్‌లోని కామల్‌కోట్‌లో పాక్ సైన్యం జరిపిన కాల్పుల్లో ఓ పౌరుడికి గాయాలయ్యాయి. పాక్ రేంజర్ల కాల్పులను భారత సైన్యం సమర్థంగా తిప్పికొట్టింది.
శాంతి అంటూనే...
పుల్వామా ఘటనతో ఇరు దేశాల మధ్య పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. పాక్‌లోని ఉగ్రవాద స్థావరాలను భారత వాయుసేన ధ్వంసం చేసింది. అంతర్జాతీయంగా పాకిస్థాన్‌ను ఏకాకి చేయటంలో భారత్ విజయవంతమైంది.
అంతర్జాతీయంగా వచ్చిన ఒత్తిళ్లకు తలొగ్గిన పాక్ భారత్‌తో శాంతి చర్చలకు సిద్ధమంటూ ప్రకటనలు చేసింది. కానీ తన వక్రబుద్ధిని మాత్రం మార్చుకోలేదు. ఓ పక్క శాంతి, శాంతి అంటూనే భారత్‌తో కయ్యానికి కాలు దువ్వుతోంది. సరిహద్దుల వెంబడి విచక్షణారహితంగా కాల్పులకు తెగబడుతోంది.