వ్యాక్సిన్ అత్యవసర వినియోగార్థం సీరం ఇన్స్టిట్యూట్, భారత్ బయోటెక్ సంస్థలు దాఖలు చేసుకున్న దరఖాస్తులపై సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్(సీడీఎస్సీఓ) సమీక్ష నిర్వహించింది. టీకా భద్రత, సమర్థతపై అదనపు సమాచారం అందించాలని ఆయా సంస్థలను కోరింది.
అత్యవసర వినియోగానికి దరఖాస్తు చేసిన అమెరికా సంస్థ ఫైజర్ అభ్యర్థనను నియంత్రణ సంస్థ పరిగణనలోకి తీసుకోలేదని అధికారులు తెలిపారు. కమిటీ ముందు ప్రజెంటేషన్ ఇచ్చేందుకు ఆ సంస్థ మరింత గడువు కోరిందని వెల్లడించారు. అయితే మిగిలిన రెండు సంస్థల టీకాలు ఇంకా కమిటీ పరిగణనలోనే ఉన్నాయని స్పష్టం చేశారు.
సీరం ఇన్స్టిట్యూట్ అభ్యర్థనను పరిశీలించిన విషయ నిపుణుల కమిటీ(ఎస్ఈసీ).. భారత్‌లో ఫేజ్ 2, ఫేజ్ 3 క్లినికల్ ట్రయల్స్‌కు సంబంధించిన తాజా డేటాను అందించాలని కోరినట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. బ్రిటన్, భారత్‌లో నిర్వహించిన క్లినికల్ ట్రయల్స్ ఇమ్యునోజెనిసిటీ సమాచారాన్నీ కోరిందని తెలిపారు. దీంతోపాటు టీకాపై యూకే నియంత్రణ సంస్థ నిర్వహించిన పరిశీలన ఫలితాలను ఇవ్వాలని అడిగినట్లు చెప్పారు.
మరోవైపు, ఫేజ్ 3 క్లినికల్ ట్రయల్స్ భద్రత, సమర్థతపై సమాచారం అందించాలని భారత్ బయోటెక్‌ను కోరినట్లు అధికార వర్గాలు తెలిపాయి. వీటి ఆధారంగా తదుపరి నిర్ణయం తీసుకుంటామని కమిటీ పేర్కొందని స్పష్టం చేశాయి.
ఇదీ చదవండి: డీఆర్డీఓ ల్యాబ్‌ల మధ్య 'క్వాంటమ్' కమ్యూనికేషన్