కరోనాపై ప్రత్యక్ష పోరాటం చేస్తున్న అత్యవసర సేవల సిబ్బందికి సంఘీభావం తెలపనున్నాయి త్రివిధ దళాలు. మే 3న దేశవ్యాప్తంగా ప్రత్యేక ప్రదర్శన ఇవ్వనున్నాయి. అత్యవసర సేవల సిబ్బందికి ప్రోత్సాహం కల్పించేలా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు తెలిపారు త్రిదళాధిపతి బిపిన్ రావత్. శ్రీనగర్ నుంచి తిరువనంతపురం వరకు.. దిబ్రూగఢ్ నుంచి కచ్ వరకు.. దేశం నలుమూలల యుద్ధ విమానాలు మే 3 సాయంత్రం భారత గగనతలంలో చక్కర్లు కొడతాయని స్పష్టం చేశారు.
కరోనా యోధులపై ప్రశంసలు కురిపించారు బిపిన్ రావత్. లాక్‌డౌన్ అమలులో ప్రజలంతా సహకరిస్తున్నట్లు చెప్పారు. కరోనా వైరస్‌పై పోరాడుతున్న యోధులకు అండగా భారత సేనలు నిలుస్తాయని ఉద్ఘాటించారు.
ఆస్పత్రులపై పువ్వులు..
నౌక దళానికి చెందిన హెలికాఫ్టర్లు ఆస్పత్రులపై పూరేకులను వదులుతూ వైద్య సిబ్బందికి కృతజ్ఞతలు చెబుతాయని పేర్కొన్నారు రావత్. జిల్లాల్లోని ఆస్పత్రి ప్రాంగణాల్లో ఆర్మీ సేనలు బ్యాండ్ ప్రదర్శన చేస్తాయని చెప్పారు. నౌకదళానికి చెందిన ఓడలు సముద్ర తీరాల్లో విన్యాసాలు చేయనున్నట్లు పేర్కొన్నారు.