కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డి.కె.శివకుమార్ నివాసంలో సీబీఐ సోదాలు చేపట్టింది. సీబీఐ అధికారులు వేర్వేరు బృందాలుగా ఏర్పడి బెంగళూరు, దిల్లీ, ముంబయిలోని 14 ప్రాంతాల్లో శివకుమార్‌కు చెందిన నివాసాలు, కార్యాలయాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు.
దొడ్డనహళ్లి, కనకపుర, సదాశివనగర్ నివాసాలు సహా కర్ణాటకలో 9 చోట్ల, దిల్లీలో నాలుగు ప్రాంతాల్లో, ముంబయిలో ఒకచోట ఈ దాడులు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
50 లక్షలు స్వాధీనం..
ఆదాయానికి మించి ఆస్తులు కలిగిన ఉన్నారన్న ఆరోపణలపై కేసు నమోదు చేసిన సీబీఐ.. శివకుమార్‌కు చెందిన నివాసాలు, కార్యాలయాల్లో ఈరోజు ఉదయం నుంచి దాడులు చేస్తోంది. ఆయన సోదరుడు, బెంగళూరు రూరల్‌ఎంపీ డి.కె సురేశ్ నివాసంలోను అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ దాడుల్లో 50 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నట్లు సీబీఐ వర్గాలు తెలిపాయి. గతంలోనూ మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న డి.కె.శివకుమార్ అరెస్టయ్యారు.
ఉపఎన్నికలే లక్ష్యంగా...
మరోవైపు సీబీఐ దాడులను కాంగ్రెస్ తీవ్రంగా ఖండించింది. కేంద్ర ప్రభుత్వం కర్ణాటక ఉపఎన్నికలను దృష్టిలో ఉంచుకొని.. డీకే శివకుమార్‌పై సీబీఐతో దాడులు చేయిస్తోందని ఆరోపించింది.