లైంగిక ఆరోపణలు చేసిన మహిళ అదృశ్యమైన నేపథ్యంలో ముముక్షు ఆశ్రమ అధిపతి, భాజపా సీనియర్ నేత, కేంద్రమాజీ మంత్రి స్వామి చిన్మయానంద్‌పై పోలీసులు మంగళవారం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
ముముక్షు ఆశ్రమం ఆధ్వర్యంలోని ఓ కళాశాలలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది ఆ యువతి. చిన్మయానంద్ తనను లైంగికంగా వేధించారంటూ ఇటీవల వీడియో క్లిప్పింగ్‌ను విడుదల చేసింది. ఈ క్రమంలోనే ఆమె అదృశ్యమయింది. ఆమె తండ్రి మంగళవారం పోలీసులను ఆశ్రయించారు. 72 ఏళ్ల భాజపా నేత, మరికొందరు తన కుమార్తెతో పాటు పలువురు యువతులను లైంగికంగా వేధించినట్లు ఫిర్యాదు చేశారు.
రూ.5 కోట్ల డిమాండ్..
ఈ నేపథ్యంలో గుర్తు తెలియని వ్యక్తి చిన్మయానంద్‌కు వాట్సప్‌లో వీడియోను పంపి రూ.5 కోట్లు డిమాండ్ చేసినట్లు అయన తరఫు న్యాయవాది పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్వామి గౌరవాన్ని భంగపరిచి, తప్పుడు మార్గాల ద్వారా సులువుగా కోటీశ్వరులు కావాలని ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. యువతి చెప్పిన దానిలో ఎటువంటి నిజం లేదని పేర్కొన్నారు.
ఈ విషయంలో ప్రతిపక్షాలు ఆ యువతికి మద్దతు ప్రకటించాయి. యువతిని రక్షించాలని డిమాండ్ చేశాయి.