విచారణలో ఉన్న కేసులపై విరివిగా వార్తలు ఇవ్వడం న్యాయ పరిపాలనలో జోక్యం చేసుకున్నట్టు అవుతుందా అని బాంబే హైకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఇది కోర్టు ధిక్కరణ చట్టం పరిధిలోకి వస్తుందో, లేదో తెలపాలని కోరింది. మీడియాలో విస్తృతంగా వార్తలు వస్తే అది దర్యాప్తుపైనా, అనంతరం కోర్టులో విచారణపైనా చెడు ప్రభావం చూపుతుందా అని అడిగింది. ఇలాంటి విషయాలపై కోర్టు మార్గదర్శకాలను రూపొందించాల్సి ఉందో లేదో తెలిపాలని కోరింది.
మీడియా వద్ద సమాచారం ఉంటే...
వీటన్నింటిపై వచ్చే నెల ఆరో తేదీలోగా సమాధానం ఇవ్వాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపంకర్ దత్తా, జస్టిస్ జి.ఎస్.కులకర్ణిలతో కూడిన ధర్మాసనం ఆదేశాలు ఇచ్చింది. సినీనటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య వ్యవహారమై విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది. అతిగా వార్తలు ఇవ్వడం వల్ల నిందితుడు జాగ్రత్త పడి ఆధారాలు ధ్వంసం చేసే ప్రమాదం ఉందని తెలిపింది. ఒకవేళ మీడియా పేర్కొన్న వ్యక్తి అమాయకుడైతే ఆయన ప్రతిష్ఠకు భంగం కలిగే అవకాశం ఉందని పేర్కొంది. దర్యాప్తు అధికారులపైనా ప్రభావం చూపే ప్రమాదం ఉందని తెలిపింది. మీడియా సూచించిన మార్గంలో దర్యాప్తు చేయకుంటే ఆయనపై విమర్శలు వచ్చే అవకాశం ఉందని అభిప్రాయపడింది. ఒకవేళ మీడియా వద్ద సమాచారం ఉంటే దాన్ని దర్యాప్తు అధికారికి ఇవ్వాల్సి ఉంటుందని పేర్కొంది.
ఇదీ చూడండి:మాస్క్ పెట్టుకోకపోతే చేతికి చీపురే!