లాక్డౌన్ కాలంలో వలస కార్మికులను స్వరాష్ట్రాలకు చేర్చి ప్రజాదరణ చూరగొన్న బాలీవుడ్ నటుడు సోనూసూద్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేను కలిశారు. ఠాక్రే నివాసం మాతోశ్రీకి వెళ్లి సీఎంతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సోనూసూద్ చేస్తున్న సేవలపై ప్రశంసలు కురింపించారు ఠాక్రే. వలసకార్మికులను స్వరాష్ట్రాలకు చేర్చే అంశంలో సోనూ తీసుకున్న చొరవ ప్రశంసనీయమని చెప్పుకొచ్చారు. శివసేన పత్రిక 'సామ్నా'లో సంపాదకుడు, శివసేన ఎంపీ సంజయ్ రౌత్.. సోనూసూద్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించిన నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.
సోనూ వెనక భాజపా వ్యాఖ్యతో మొదలు..
లాక్డౌన్ కాలంలో ప్రజలకు సోనూసూద్ చేస్తున్న సేవల పట్ల.. భాజపా చేతిలో కీలుబొమ్మగా అభివర్ణిస్తూ శివసేన పత్రిక సామ్నాలో సంజయ్‌రౌత్ వ్యాసం రాశారు. లాక్డౌన్ కాలంలో కొత్త మహాత్ముడు పుట్టుకొచ్చారని చెప్పారు. శివసేనను, మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలనే ఉద్దేశంతోనే సోనూసూద్‌ను భాజపా తెరపైకి తీసుకొచ్చిందని సంజయ్‌రౌత్ ఆరోపించారు. త్వరలోనే సోనూసూద్ ప్రధానిని కలిసి 'ఆ పార్టీకి' ప్రచారం కూడా చేస్తారని రౌత్ జోస్యం చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఉద్ధవ్‌తో భేటీ అయ్యారు సోనూసూద్.
ఇదీ చూడండి: 'భాజపా చేతిలో సోనూసూద్ కీలుబొమ్మ'