ఉత్తరప్రదేశ్ మథుర ప్రాంతం అంగ్రాలాలో బోరుబావిలో పడ్డ ఐదేళ్ల ప్రవీణ్‌ను రక్షించారు అధికారులు. జాతీయ విపత్తు నిర్వహణ-ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, సైనికులు దాదాపు రెండు గంటల పాటు శ్రమించి బాలుడిని కాపాడారు. వంద అడుగుల లోతులో చిక్కుకున్న ప్రవీణ్‌కు ఊతంగా ఓ పైపును పంపి... దాని సాయంతో కాపాడినట్లు రక్షణ బృందాలు తెలిపాయి.
"బాలుడు సురక్షింగా ఉన్నాడు. అతడి ఆరోగ్యానికి ఏమీ ఢోకా లేదు. ముందుజాగ్రత్తగా ఆసుపత్రికి తరలించాం. వైద్యుల పరిశీలన అనంతరం కుటుంబ సభ్యలకు అప్పగిస్తాం."
- అనిల్ కుమార్ సింగ్, ఎన్డీఆర్ఎఫ్ అసిస్టెంట్ కమాండర్
ఇలా పడిపోయాడు...
వ్యవసాయ కూలీ చేసేందుకు ఓ తల్లి కుమారుడిని వెంటబెట్టుకుని వెళ్లింది. అక్కడికి వచ్చిన ఇతర బాలురతో కలిసి ఆడుకుంటున్నాడు ప్రవీణ్. ఆటలో భాగంగా పరిగెడుతూ తెరచి ఉన్న బోరుబావిలో పడిపోయాడు. మిగతా పిల్లల అరుపులు విన్న తల్లిదండ్రులు, చుట్టు పక్కల ఉన్నవారు పరిగెత్తి వచ్చి అధికారులకు సమాచారాన్నందించారు. అనేక గంటల తర్వాత ప్రవీణ సురక్షితంగా బయటపడ్డాడు.