అందరి అంచనాలను నిజం చేస్తూ మధ్యంతర బడ్జెట్లో రైతుబంధు తరహాలో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజనను ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. ఐదెకరాలు, అంతకన్నా తక్కువ భూమి ఉన్న రైతులకు ఏటా రూ.ఆరు వేల ఆర్థిక సాయాన్ని అందించనున్నట్టు తెలిపారు. మూడు విడతల్లో నేరుగా ఈ మొత్తం లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతాయని ఆర్థిక మంత్రి తెలిపారు. దీనికి అయ్యే పూర్తి ఖర్చు రూ. 75 వేల కోట్లను కేంద్రం ప్రభుత్వమే భరిస్తుందని పీయూష్ స్పష్టం చేశారు.
" తక్కువ కమతాలున్న రైతులకు ప్రభుత్వ సాయం ఎంతో అవసరం. కనీసం విత్తనాలు, ఎరువులు, కూలీల విషయంలోనైనా సాయం అందాలి. అందుకోసమే చిన్న, సన్నకారు రైతులకు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజనను తీసుకొస్తున్నాం. ఐదు ఎకరాలు, అంతకన్నా తక్కువ భూమి ఉన్న రైతులకు ఏటా రూ. ఆరు వేలను ప్రభుత్వం అందిస్తుంది. ఈ సాయాన్ని మూడు విడతల్లో రూ. రెండు వేల చొప్పున లబ్దిదారుల బ్యాంకు ఖాతాల్లోకి ప్రభుత్వం నేరుగా చేరవేస్తుంది. ఈ పథకంతో 12 కోట్ల మంది రైతులు ప్రత్యక్షంగా లబ్ధి పొందుతారు. 2018 డిసెంబర్ 1 నుంచే ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తాం. త్వరగా జాబితా సిద్ధం చేసి మొదటి విడతగా రూ. రెండు వేలు అందిస్తాం. ఈ పథకానికి అయ్యే అంచనా వ్యయం రూ.75 వేల కోట్లను కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది. "
- పీయూష్ గోయల్, కేంద్ర ఆర్థిక మంత్రి